
అవగాహన కల్పిస్తున్న డాక్టర్ నాగరాజు
కరీంనగర్‌టౌన్: వయసు, వంశపారపర్యంతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధి వస్తుందని, దాన్ని నిర్లక్ష్యం చేయవద్దని మెడికవర్ ఆస్పత్రి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నాగరాజు అన్నారు. మధుమేహాన్ని అందుపులో ఉంచాలంటే చికిత్స కంటే నివారణ చర్యలు మేలని తెలిపారు. వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా మంగళవారం కరీంనగర్‌లోని ఆస్పత్రిలో షుగర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధుమేహం తగ్గడానికి ఆహారం, వ్యాయామ నియమాలు పాటించాలన్నారు. కొందరు వీటిని పట్టించుకోకపోవడం వల్ల ట్యాబ్లెట్ల నుంచి ఇన్సులిన్ వాడే పరిస్థితులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. వ్యాధిగ్రస్తులకు మానసిక ప్రశాంతత ఎంతో అవసరమన్నారు. జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ నియంత్రణ పెద్ద సమస్యేమీ కాదని తెలిపారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
అపోలో రీచ్ ఆధ్వర్యంలో..
వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా అపోలో రీచ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మంగళవారం అంబేడ్కర్ స్టేడియంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ భాగస్వామ్యంతో అవగాహన సదస్సు, వ్యాయామ ప్రాధాన్యత తెలియజేస్తూ ఒక కిలోమీటర్ పరుగు పందెం చేపట్టారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు చంద్రశేఖర్, తిరునాధర్, అనిల్ మూల్పూర్, సుబ్రత్ కుమార్, వాసు, అజయ్ ఖండల్, రాజకుమార్, నాగ సతీశ్, మహేశ్ పాల్గొన్నారు.
మెడికవర్ ఆస్పత్రిలో అవగాహన కల్పించిన వైద్యులు