రైతులపై కేసుల ఎత్తివేతకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

రైతులపై కేసుల ఎత్తివేతకు చర్యలు

Nov 29 2026 1:14 AM | Updated on Nov 29 2026 1:14 AM

● ఆధునిక పోలీస్‌స్టేషన్‌ నిర్మాణం

అభినందనీయం

● డీజీపీ సీవీ ఆనంద్‌

మోపాల్‌: మంచిప్ప ప్రాణహిత–చేవెళ్ల 21వ ప్యాకేజీ సాధన కోసం పోరాడిన రైతులతోపాటు పసుపు, ఎర్రజొన్న రైతులపై రాజకీయ కారణాలతో నమోదైన కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటామని డీజీపీ సీవీ ఆనంద్‌ హామీనిచ్చారు. గతంలో రైతులపై నమోదైన కేసుల అంశాన్ని ఎమ్మెల్యే భూపతిరెడ్డి తన దృష్టికి తీసుకొచ్చారని, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని పేర్కొన్నారు. మోపాల్‌ మండల కేంద్ర శివారులో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ భవనాన్ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీజీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ మోపాల్‌ పీఎస్‌ భవన నిర్మాణానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, సర్పంచులు, గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు నిత్య సేవలు అందించే ముఖ్యమైన కార్యాలయాల్లో తహసీల్‌ కార్యాలయంతోపాటు పోలీస్‌స్టేషన్‌ కూడా ఒకటని పేర్కొన్నారు. కీలకమైన పోలీస్‌స్టేషన్‌ నిర్మాణానికి ప్రజలు స్వచ్ఛందంగా సహకరించడం అభినందనీయమన్నారు. జిల్లా తనకు కొత్తేమీ కాదని, గతంలో ఇక్కడ పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. ఇక్కడ ఎస్పీగా పనిచేసిన సమయంలోనే తనకు కుమారుడు జన్మించాడని, ఆ అనుబంధంతోనే నిఖిల్‌ అని పేరు పెట్టినట్లు తెలిపారు. జిల్లా ప్రజలు శాంతియుత స్వభావం కలిగిన వారని, ఎన్నికలు సైతం ప్రశాంతంగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్‌లోనూ కొనసాగిస్తూ పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ షేర్‌ వాల్‌ టెక్నాలజీతో ఆధునిక పద్ధతిలో ఈ భవనాన్ని నిర్మించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో మల్టీజోన్‌–1 ఐజీపీ కార్తికేయ, డీఐజీ నారాయణ్‌ నాయక్‌, సీపీ సాయిచైతన్య, రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక సహకార కార్పొరేషన్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌ గౌడ్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ము ప్ప గంగారెడ్డి, ఏసీపీ ప్రకాశ్‌, సీఐ భిక్షపతి, ఎస్సై జాడె సుస్మిత, పోలీస్‌ ఉన్నతాధికారులు, సర్పంచులు, నాయకులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

గంజాయి జోలికి వెళ్లొద్దు

ఖలీల్‌వాడి: గంజాయి జోలికి మళ్లీ వెళ్లొద్దని, భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఎదురైనా పోలీసుల దృష్టికి తీసుకొస్తే పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గంజాయి వ్యసనానికి గురై పోలీసుల సహకారంతో డీ–అడిక్షన్‌ సెంటర్‌లో చికిత్స పొందిన బాధితులతో సీపీ కార్యాలయంలో డీజీపీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బాగోగులను అడిగి తెలుసుకున్నారు. గంజాయి వ్యసనం నుంచి బయటపడేందుకు బాధితులు చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ, ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ పదార్థాల జోలికి వెళ్లకూడదని స్పష్టంగా సూచించారు. మత్తు పదార్థాల బారిన పడిన వారిని నేరస్తులుగా చూడకుండా వారికి సరైన చికిత్స, కౌన్సెలింగ్‌, పునరావాసం కల్పించి తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడం పోలీస్‌ శాఖ సామాజిక బాధ్యతలో భాగమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement