● అభ్యంతరాల స్వీకరణకు
డిసెంబర్ 9 చివరి తేదీ
● అదనపు కలెక్టర్, పీఐసీ చైర్మన్
బి రాజాగౌడ్
సుభాష్‌నగర్: ఇందూర్ జిల్లా సహకార మార్కెట్ సొసైటీ లిమిటెడ్‌ను మార్క్‌ఫెడ్ (హైదరాబాద్)లో విలీనం చేసేందుకు మెజార్టీ సభ్యులు ఒప్పుకుని తీర్మానం చేసినట్లు అడిషనల్ కలెక్టర్, ఐడీసీఎంఎస్ పీఐసీ చైర్మన్ బి రాజాగౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఐడీసీఎంఎస్ కార్యాలయంలో 57వ ప్రత్యేక మహాజన సభను పీఐసీ చైర్మన్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. సమావేశానికి హాజరుకాని పీఏసీఎస్ చైర్మన్లు, బి గ్రూప్ సొసైటీ చైర్మన్లు డిసెంబర్ 9వ తేదీలోగా కలెక్టర్, డీసీవో కార్యాలయాల్లో, ఐడీసీఎంఎస్, ఆర్సీఎస్ (సహకారశాఖ రిజిస్ట్రార్, హైదరాబాద్)కు రాతపూర్వకంగా తమ అభ్యంతరాలు, అభిప్రాయాలను తెలుపవచ్చిన రాజాగౌడ్ పేర్కొన్నారు. మొత్తం 35 మంది సభ్యులు సమావేశానికి హాజరు కాగా 12 మంది విలీనానికి వ్యతిరేకంగా, 23 మంది అనుకూలంగా అభిప్రాయాలు తెలిపారు.
రూ.కోట్లలో ఆస్తులు కలిగి లాభాల్లో కొనసాగుతున్న ఐడీసీఎంఎస్ను నష్టాల్లో కూరుకుపోయిన మార్క్‌ఫెడ్‌లో ఎలా విలీనం చేస్తారని రాజంపేట్ సొసైటీ చైర్మన్ నల్లవెల్లి అశోక్ సహా పలువురు చైర్మన్లు అభ్యంతరం తెలిపారు. మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయడం వల్ల రైతాంగానికి తీరని నష్టమని అభిప్రాయపడ్డారు. అలాగే ఉమ్మడి జిల్లా ఐడీసీఎంఎస్‌లో విధులు నిర్వహిస్తున్న 20 మంది ఉద్యోగులను యథావిధిగా కొనసాగిస్తూ, వారిని కూడా తెలంగాణ మార్క్ఫెడ్లోకి తీసుకోవాలని సభ్యులు తీర్మానం చేశారు. అంతకుముందు ఉద్యోగులను మార్క్‌ఫెడ్‌లో విలీనం చేసి ఉపాధి అవకాశం కల్పించాలని కోరుతూ అదనపు కలెక్టర్, పీఐసీ చైర్మన్ బి రాజాగౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో డీసీవో, పీఐసీ మెంబర్ ఎన్ శ్రీనివాస్‌రావు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సొసైటీ చైర్మన్లు, బి గ్రూప్ సొసైటీ చైర్మన్లు, బిజినెస్ మేనేజర్ కె నగేశ్, ఉద్యోగులు పాల్గొన్నారు.


