స్వయం ఉపాధి పొందొచ్చు
నస్రుల్లాబాద్: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి మార్గాలను చూపిస్తూ నస్రుల్లాబాద్‌లోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం (ఆర్‌సేటి) అండగా నిలుస్తోంది. కేవలం శిక్షణకే పరిమితం కాకుండా, యువతలో నైపుణ్యాలను పెంపొందించి సొంతంగా ఉపాధి పొందేలా తీర్చిదిద్దుతోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో, కెనరా బ్యాంకు సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతులు నిరుద్యోగ యువతకు ఆశాకిరణంగా మారుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ కేంద్రం ద్వారా పలువురు యువతీయువకులు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆర్‌సేటి నిధులతో కెనరా బ్యాంకు సహకారంతో ఈ ఏడాది మార్చి 27న ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఒక్కో బ్యాచ్‌లో 35 మంది చొప్పున శిక్షణ పొందుతున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది బ్యాచ్‌లు పూర్తి కాగా, దాదాపు 300 మంది యువతీ యువకులు వివిధ రంగాల్లో శిక్షణ పొందారు. పుట్టగొడుగుల పెంపకం, మగ్గం వర్క్, మహిళలకు సంబంధించిన వివిధ చేతివృత్తులు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాల్లో శిక్షణ అందిస్తున్నారు. ఈ నెలలో మరో బ్యాచ్‌కు సంబంధించి హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ తయారీ శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది.
శిక్షణతో పాటు రుణ సదుపాయం
కేవలం నైపుణ్యాలను నేర్పించడమే కాకుండా, శిక్షన పూర్తి చేసుకున్న వారికి స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన రుణ సదుపాయం కల్పించేలా కేంద్రం కృషి చేస్తోంది. నేర్చుకున్న విద్యను ఆచరణలో పెట్టి ఆర్థికంగా నిలదొక్కుకునేలా సంబంధిత అధికారులు ప్రోత్సహిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో సొంతంగా ఉపాధి పొందే అవకాశాలు ఉండటంతో యువత ఆసక్తి చూపుతున్నారు. ఈ శిక్షణ కేంద్రం మరింత మందికి ఉపాధి మార్గం చూపుతూ ఆదర్శంగా నిలుస్తోంది.
ఉచిత శిక్షణ ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు. శిక్షణకు వచ్చే వారికి ఉచిత వసతి, భోజనం సదుపాయం కలదు. ఇందులో 18 రకాలు శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ సోమవారం నుంచి మరో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలి.
– అమర్ సింగ్, డైరెక్టర్
స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా
ఉచిత శిక్షణ తరగతులు
కేంద్ర ప్రభుత్వ ఆర్‌సేటి నిధులతో
నస్రుల్లాబాద్‌లో శిక్షణ
ఇప్పటి వరకు 8 బ్యాచ్‌లు పూర్తి..
30 మందికి శిక్షణ


