నేడు కిసాన్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

నేడు కిసాన్‌ మేళా

Oct 1 2026 4:46 AM | Updated on Oct 1 2026 4:46 AM

నేడు కిసాన్‌ మేళా

వ్యవసాయ కుంటలు, నీటి సంరక్షణ చర్యలు..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలో కిసాన్‌ మేళాకు వ్యవసాయ శాఖ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని కళాభారతి వేదికగా బుధవారం ఈ మేళా జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. మేళాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్ల నుంచి 4 వందల మంది చొప్పున 8 వందల మంది రైతులు, బాన్సువాడ, బిచ్కుంద డివిజన్ల నుంచి వంద మంది చొప్పున రెండు వందల మంది రైతులు హాజరవుతారని అధికారులు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎంపిక చేసిన పది మంది ఆదర్శ రైతులతో వారి అనుభవాలను వివరించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఎల్‌నినో పరిస్థితులు.. ప్రత్యామ్నాయ సాగు..

తక్కువ వర్షపాతం, ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులు వంటి పరిస్థితుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అధిక నీరు అవసరమయ్యే పంటలపై పూర్తిగా ఆధారపడకుండా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను రైతులు ఎంచుకోవడంపై మేళాలో అవగాహన కల్పించనున్నారు. కందులు, పెసర్లు, మినుములు, జొన్న, మొక్కజొన్న, సజ్జ, కొర్రలు, వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమలు, కూరగాయలు వంటి పంటలను పరిస్థితులకు అనుగుణంగా సాగుచేయవచ్చని, దీనివల్ల నీటి వినియోగం తగ్గడంతో పాటు వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో పంట నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయ దీర్ఘకాలిక పంటగా ఆయిల్‌పాంను అధికారులు సూచిస్తున్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ మిషన్‌ కింద కందులు, పెసర్లు, మినుములు, శనగలు వంటి పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించనున్నారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌, జాతీయ నూనె గింజల మిషన్‌ ద్వారా వివిధ పంటల సాగుపై అవగాహన కల్పించనున్నారు.

వర్షపు నీరు వృథాగా పోకుండా నిల్వ చేసుకోవడానికి వ్యవసాయ కుంటలను ఏర్పాటు చేసుకోవడం నీటి సంరక్షణలో ముఖ్యమైన చర్యగా పేర్కొంటున్న ప్రభుత్వం.. ప్రతి రైతు తమ పంట చేనులో నీటి నిల్వ కోసం కుంటలు నిర్మించుకోవాలని సూచిస్తోంది. అలాగే ఊరూరా ఊట కుంట నిర్మించుకోవాలని చెబుతోంది. వీటన్నింటిపైనా కిసాన్‌మేళాలో అవగాహన కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు.

భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు

జిల్లా నలుమూలల నుంచి

తరలిరానున్న కర్షకులు

సూచనలు అందించనున్న సైంటిస్టులు,

అనుభవాలు పంచుకోనున్న ఆదర్శ రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement