శిక్షణ తరగతుల్లో ‘సాక్షి’ కథనంపై చర్చ
● మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ : సామాజిక సేవ కోసం జర్నలిజంను వృత్తిగా ఎంచుకోవాలని, వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలలో తెలంగాణ మీడియా అకాడమీ, టీయూడబ్ల్యూజేల ఆధ్వర్యంలో మంగళవారం రెండురోజుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1998లో బాన్సువాడలో ప్రెస్‌క్లబ్ భవనం ప్రారంభోత్సవానికి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తాను హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్‌లో వచ్చామని గుర్తుచేసుకున్నారు.
జర్నలిజమంటేనే విలువలతో కూడిన వృత్తి అని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని పూసగుచ్చినట్లు పత్రికలు వివరించాయని, దీంతో ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకునేందుకు వీలు పడిందని పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్టులు దిలీప్‌రెడ్డి, గోవిందరెడ్డి, మార్కండేయ, నరసింహస్వామి తదితరులు ఆయా అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఓఎస్డీ రహమాన్, ఆగ్రో ఇండస్ట్రీస్ మాజీ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్, ఐజేయూ నేషనల్ కౌన్సిల్ మెంబర్ వేణుగోపాల్‌చారి, టీయూడబ్ల్యూజే ప్రతినిధులు లతీఫ్, రజినీకాంత్, రాజేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ ఆర్డీవో రవీందర్‌రెడ్డి శిక్షణ తరగతుల్లో మాట్లాడుతూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావించారు. ‘బాధల్‌గావ్’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం పెద్దకొడప్‌గల్ మండలంలోని బాబుల్‌గావ్ ప్రజల బాధలు అధికారులకు తెలిసేలా చేసిందన్నారు. బాబుల్‌గావ్ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని, ఇప్పటివరకు 60 శాతం సమస్యలు పరిష్కరించామని పేర్కొన్నారు. ఈ కథనం తనకు బాగా నచ్చిందన్నారు.


