● మధ్యాహ్న భోజనంలో సక్రమంగా
అందని పరిస్థితి
● పెరిగిన ధరలకనుగణుంగా స్లాబ్‌రేటు
ఇవ్వాలంటున్న ఎండీఎం నిర్వాహకులు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): ప్రైవేటుకు దీటుగా విద్య నందించాలనే లక్ష్యంతో, పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకు విద్యార్థులకు పోషకాహారం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఉడకబెట్టిన కోడి గుడ్డును వారంలో సోమ, బుధ, శుక్రవారాల్లో వడ్డించాల్సి ఉంది. కోడి గుడ్డూ ధర తరుచూ పెరుగుతుంది. దీంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఇది భారంగా మారుతోంది. చాలా పాఠశాల్లో ఇది సక్రమంగా అమలు కావడం లేదు. కొన్ని పాఠశాలల్లో నెలలో నాలుగైదు సార్లు మాత్రమే పెడుతున్నట్లు విమర్శలున్నాయి. దీంతో విద్యార్థులకు పోషకాహారం దూరమవుతోంది. సదాశివనగర్ మండలంలో 46 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల పరిధిలో 3వేల 556 మంది విద్యార్థులు చదువుతుకుంటున్నారు. 45 ండీఎం ఏజన్సీలు పని చేస్తున్నాయి.
ప్రభుత్వం రూ. 6 మాత్రమే చెల్లిస్తోంది..
నిబంధనల ప్రకారం వారంలో మూడు రోజులు రాగి జావ అందిస్తున్నారు.మూడు రోజులు కోడి గుడ్లు అందించాలి. ప్రభుత్వం గుడ్డుకు రూ.6 మాత్రమే చెల్లిస్తుంది. మార్కెట్‌లో రూ.7 దాటింది. దీంతో గుడ్డుకు రూ.1 అదనంగా చెల్లించడంతో భారమవుతుందని ఎండీఎం నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఒక్కో విద్యార్థికి అయ్యే ఖర్చులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ధరలు పెంచితేనే విద్యార్థులకు పోషకాహారం అందుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గిట్టుబాటు కావడం లేదు...
మార్కెట్‌లో గుడ్డు ధర ఎక్కువగా పెరగడంతో కొన్ని పాఠశాలల్లో అటకెక్కిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు రెండు రోజులు గుడ్డు అందించి ఒక రోజు అరటి పండు ఇవ్వాలని మౌఖికంగా చెబుతున్న అమలుకు నోచుకోవడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. అంగన్‌వాడీల మాదిరిగానే నిత్యవసర సరుకులు కోడి గుడ్లు అందించాలని డిమాండ్‌ను వంట ఏజెన్సీ నిర్వాహకులు కోరుతున్నారు.


