గాంధారి: రైతులు వానాకాలంలో సాగు చేసిన పంటల వివరాలను డిజిటల్ సర్వే చేయించుకోవాలని ఏఈవో విఘ్నేష్ కోరారు. పంటల డిజిటల్ సర్వే చేయడంకోసం ప్రత్యేకంగా సర్వేయర్లను నియమించినట్లు తెలిపారు. ఈ సర్వే ఆధారంగానే కొనుగోలు కేంద్రాల్లో తాము పండించిన పంటలను విక్రయించడానికి వీలవుతుందన్నారు. సర్వేయర్లు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
సోయా పంట పరిశీలన
బిచ్కుంద: మండలంలోని పెద్ద దేవాడ గ్రామంలో శనివారం ఏవో అమర్ ప్రసాద్ సోయా పంటను పరిశీలించారు. వాతావరణ మార్పులతో సోయా పంటకు చీడపీడలు, తెగుళ్లు ఆశించాయని గుర్తించారు. ఆకుపచ్చ తెగుళ్లు, దోమ వైరస్ తెగుళ్లు సోకి పంటకు నాశనం చేస్తోందని, తెగుళ్ల నివారణ కోసం పాఫికోనాజోల్ ఎకరానికి 200 ఎంఎల్ లేదా టేబుకొనాజోల్ 200 ఎంఎల్‌తో పిచికారీ చేయాలని సూచించారు. వైరస్ వ్యాపించే దోమ నివారణ కోసం థయోమితగ్జామ్ 80 గ్రామల చొప్పున పిచికారి చేసుకోవాలన్నారు. పత్తి ఇతర పంటలపై తెగుళ్ల రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
పీఎంజేయూజీఏ పథకంపై అవగాహన
నస్రుల్లాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకంపై మండల పశువైద్యాధికారి డా.విజయ్ అవగాహన కల్పించారు. శనివారం మండలంలోని అంకోల్‌తండా, సంగం, హాజీపూర్ గ్రామాల్లో పర్యటించిన ఆయన గిరిజన రైతులకు ఈ పథకం వివరాలను తెలియజేశారు. ఈ పథకం ద్వారా 90% వరకు సబ్సిడీతో గొర్రెలు/మేకలు, దేశీ కోళ్లు, పందుల యూనిట్లను పొందవచ్చని తెలిపారు. ఎఫ్‌ఆర్‌ఏ పట్టా కలిగి ఉన్న ఎస్టీ కులానికి చెందిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. ఆధార్‌కార్డు, ఎఫ్‌ఆర్‌ఏ పట్టా, బ్యాంకు పాస్ బుక్, ఎస్టీకుల ధృవీకరణ పత్రం జిరాక్స్ లను గ్రామ కార్యదర్శికి అందజేయాలని సూచించారు.
పాముకాటుపై..
బాన్సువాడ రూరల్/లింగంపేట : బాన్సువాడ మండలం హన్మాజీపేట్ పీహెచ్‌సీలో శనివారం ప్రపంచ పాముకాటు అవగాహన దినోత్సవం నిర్వహించారు. ఈసందర్బంగా మెడికల్ ఆఫీసర్ ప్రసన్నమీన ఆస్పత్రిలో అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. పాముకాటుకు గురైన వెంటనే సమీపంలోని అస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందించాలన్నారు. పాముకాటు నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చెట్ల పొదలు, పొలాలు, రాత్రిపూట సంచరించేటప్పుడు కాళ్లకు మోకాలి వరకు ఉండే బూట్లు ధరించాలన్నారు. ఆస్పత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. లింగంపేట పీహెచ్‌సీలో ప్రపంచ పాముకాటు అవగాహన దినోత్సవం సందర్బంగా మండల వైద్యాధికారి హిమబిందు మాట్లాడారు. పాముకాటును నివారిద్దాం–ప్రాణాలను కాపాడుదాం అనే నినాదంతో గ్రామీన ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.
ఎయిడ్స్ వ్యాధిపై..
మద్నూర్: హెచ్‌ఐవీ ఎయిడ్స్‌పై మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో శనివారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఐసీటీసీ కౌన్సెలర్ జయసూర్య పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆశోక్, పాండురంగ్, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.


