● కీలక సమయంలో కరుణించిన వరుణుడు
● మూడు రోజులపాటు జల్లులు
● వరికి సైతం ప్రయోజనం
కళకళలాడుతున్న సోయా పంట
జిల్లాలో వానాకాలం సీజన్‌లో 5,53,473 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 3,19,361 ఎకరాల్లో సాగవగా.. వర్షాధార పంటలు 2,34,113 ఎకరాల్లో సాగయ్యాయి. మొదట్లో ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవవని, లోటు వర్షపాతం నమోదవుతుందని అధికారులు హెచ్చరించారు. ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. ఊరూరా రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించింది. అధికారుల హెచ్చరికలకు అనుగుణంగానే సీజన్ ప్రారంభంలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. అయితే నెలన్నర ఆలస్యంగా వరుణుడు కరుణించాడు. వాగులు, వంకలు పారాయి. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. సగానికి పైగా చెరువులు, కుంటలు అలుగులు పోశాయి. నిజాంసాగర్ మినహా జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిండాయి. దీంతో జిల్లాలో జోరుగా పంటలు సాగయ్యాయి. ఎల్ నినో ప్రభావంతో ఈసారి వరి సాగు విస్తీర్ణం తగ్గుతుందని భావించగా.. భారీ వర్షాలతో రైతులు విస్తృతంగా నాట్లు వేయడంతో దాదాపు గతేడాదితో సమానంగా వరి నాట్లు పడ్డాయి. అలాగే ఆరుతడి పంటలు కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యాయి.
మూడు వారాలు ముఖం చాటేసి..
సుమారు నెలపాటు మురిపించిన వరుణుడు.. ఆ తర్వాత ముఖం చాటేశాడు. దాదాపు మూడు వారాలుగా వర్షాలు లేకపోవడం పంటలకు ఇబ్బందికరంగా మారింది. ఇదే సమయంలో ఉష్ణోగ్రతలు పెరగడం, విద్యుత్ కోతలు రైతాంగానికి కునుకులేకుండా చేశాయి. దీంతో ప్రధానంగా ఆరుతడి పంటలు నీరు లేక ఎండుముఖం పట్టాయి.
పంటలకు కీలకమైన సమయంలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. నీటి తడి లేక ఆరుతడి పంటలు ఎండుముఖం పట్టాయి. అలాగే వరి పొట్ట దశలో ఉండగా.. కరెంటు కోతలు పెరిగి చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతినే పరిస్థితి తలెత్తింది. దీంతో రైతులు సబ్‌స్టేషన్ల ముందు ఆందోళనకు దిగారు. అయితే రైతుల ఆశలు ఆవిరవుతున్న తరుణంలో వరుణుడు మళ్లీ వర్షించాడు. తుఫాన్ ప్రభావంతో ఈనెల 12, 13, 14 తేదీలలో కురిసిన జల్లులు అన్ని పంటలకు కాస్త ఊపిరి పోశాయి. సదాశివనగర్, భిక్కనూరు, కామారెడ్డి, రామారెడ్డి, పిట్లం, పెద్దకొడప్‌గల్, పాల్వంచ, మాచారెడ్డి, గాంధారి, డోంగ్లీ, జుక్కల్, నస్రుల్లాబాద్, దోమకొండ, నిజాంసాగర్, మహ్మద్‌నగర్, బిచ్కుంద తదితర మండలాల్లో మూడు రోజుల పాటు కురిసిన జల్లులు, ముసురు పంటలకు ఎంతో మేలు చేసింది.
ఎండుముఖం పడుతున్న పంటలపై
వరుణుడు కరుణ చూపాడు. మూడు రోజులపాటు అడపాదడపా కురిసిన వర్షాలతో
ఆరుతడి పంటలకు మళ్లీ జీవకళ వచ్చింది. వరికి సైతం మేలు జరిగింది.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి


