● బడుల్లో మౌలిక సదుపాయాల
కల్పనకు ప్రాధాన్యం
● జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ప్రభుత్వ బడులను బలోపేతం చేయడంతోపాటు నాణ్యమైన విద్యనందించడమే సర్కారు లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్(బాలుర)ను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా అభివృద్ధి చేయడానికి మంగళవారం నూతన భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కొత్త భవనంలో ఆధునిక సౌకర్యాలు ఉంటాయన్నారు. షబ్బీర్‌అలీ మాట్లాడుతూ తాను చదువుకున్న బడి.. తన భావి జీవితానికి పునాది వేసిన ప్రదేశమన్నారు. పాఠశాలకు ఏ అవసరం ఉన్నా సొంత డబ్బులతో సమకూరుస్తానన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఉద్యోగినుల వసతి కోసం నిర్మించిన సఖి నివాస్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్ షెట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావ్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్‌వై గిరి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్, కాంగ్రెస్ నేతలు ఇంద్రకరణ్‌రెడ్డి, సందీప్, శ్రీనివాస్‌రెడ్డి, రాజు, మోహన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, తిర్మల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


