కామారెడ్డి క్రైం: ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కామారెడ్డి పోలీసులు వినూత్నంగా ట్రాఫిక్ పోలీస్ రూపంలో ఉన్న గణపతిని ప్రతిష్ఠించారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ఆవరణలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ బూత్‌ను వినాయక మండపంగా తీర్చిదిద్దారు. మండపం వద్ద ట్రాఫిక్ రూల్స్‌కు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. భక్తితో పాటు రహదారి భద్రతపై బాధ్యతను గుర్తుచేసేలా ఈ వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకల్లో ఎస్పీ రాజేశ్ చంద్ర పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ట్రాఫిక్ నిబంధనలు కేవలం జరిమానాలు, కేసుల కోసమే కాదన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడంతో పాటు రహదారి భద్రత, నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీ మధుసూదన్, పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, ట్రాఫిక్ ఎస్సై చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


