ఎల్లారెడ్డి: పట్టణంలో అమృత్ 2.0 పథకం పనులు నత్తనడకన సాగుతుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పలు చోట్ల పనులను అసంపూర్తిగా వదిలేయడంతో రోడ్లన్నీ గుంతలయంగా మారాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ఆర్నెళ్లుగా సాగుతూ..
ఇంటింటికీ కుళాయి కనెక్షన్ కోసం ఎల్లారెడ్డి పట్టణానికి అమృత్ 2.0 పథకం కింద సుమారు రూ.20కోట్ల నిధులు మంజూరయ్యాయి. దీంతో ఆర్నెళ్ల క్రితం పనులు ప్రారంభం కాగా ఇంకా సాగుతునే ఉన్నాయి. నల్లాల ఏర్పాట కోసం పట్టణంలోని వీధుల్లో సీసీ రోడ్లను తవ్వారు. పలుచోట్ల గుంతలను అసంపూర్తిగా వదిలేశారు. తవ్వకాలతో దారులన్నీ గుంతలమయం కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నచిన్న వీధుల్లో రోడ్ల మధ్యలో నుంచి గుంతలను తవ్వడం వల్ల ఆ వీధుల్లోకి వెళ్లడం దాదాపు అసాధ్యమవుతుంది. రాత్రివేళ చీకట్లో గుంతలు కనపడక పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షాకాలం కారణంగా గుంతల కోసం తవ్విన మట్టి బురదమయంగా మారడంతో వాహనాలతోపాటు పాదచారులు జారిపడుతున్నారు. ఓవైపు పట్టణంలో ప్రధాన రహదారిపై రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతుండడంతో ట్రాఫిక్‌ను గల్లీల్లోకి మళ్లిస్తున్నారు. గల్లీల గుండా వెళదామంటే అమృత్ పథకం కోసం తవ్విన గుంతలు కారణంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పనులను వేగవంతంగా చేయడంతోపాటు ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఎల్లారెడ్డిలో నత్తనడకన
అమృత్ 2.0 పనులు
కుళాయి కనెక్షన్ల కోసం
సీసీరోడ్లు ధ్వంసం
ఇబ్బందులు పడుతున్న ప్రజలు


