పెండింగ్‌లో
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులు పెండింగ్ ఖాతాలో చేరాయి. ఏళ్లు గడుస్తున్నా పనులు ముందుకు కదలడం లేదు. ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ సైతం జరగలేదు. పనులు ఎప్పుడు పూర్తవుతాయో, రైతుల సాగునీటి కష్టాలు ఎప్పుడు తీరుతాయో పాలకులకే తెలియాలి. సరిగ్గా ఏడాది నాడు జిల్లాను ముంచెత్తిన వరదలతో భారీ నష్టం జరిగింది. 50 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఆఖరుకు పోచారం, సింగీతం, కల్యాణి ప్రాజెక్టులకు నష్టం జరిగింది. పంటలకు పరిహారం అందలేదు. ప్రాజెక్టుల పునర్నిర్మాణం ఇప్పటికీ మొదలుకాలేదు. రోడ్లు, వంతెనల సంగతి దేవుడెరుగు. నేటి నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాలు, వరదలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం అంశాలపై చర్చ జరుగుతుందేమోనని రైతులు ఆశతో ఉన్నారు.
మంజీరా నదిపై నిజాంసాగర్ దిగువన నాగమడుగు ఎత్తిపోతల పథకానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 476 కోట్లు మంజూరు చేసింది. అప్పట్లో పనులు చేపట్టారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత డిజైన్‌లో మార్పులు చేయాలంటూ ప్రతిపాదనలు రావడంతో మూలన పడింది. జుక్కల్ నియోజకవర్గంలోని నాన్ కమాండ్ ఏరియాలో 40 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు దీనిని చేపట్టారు. రైతులు నాగమడుగు మీద పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. గత ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టును పూర్తిచేసే విషయంలో ప్రస్తుత పాలకులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది.
గతేడాది ఆగస్టు నెలాఖరులో రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షాలతో వరదల మూలంగా జిల్లా అతలాకుతలమైంది. సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులను ఓదార్చి భరోసా ఇచ్చారు. దాదాపు 50 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సీఎం వచ్చి వెళ్లి మొన్నటికి ఏడాది గడిచినా రైతులకు నయాపైసా సాయం అందలేదు. అలాగే వరదలతో దెబ్బతిన్న ప్రాజెక్టులు, కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనల పునర్నిర్మాణానికి నిధులు విడుదల కాలేదు. అసెంబ్లీ సమావేశాల్లోనైనా జిల్లా పరిస్థితులపై ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిద్దాం!
వరదలతో దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు
50 వేల ఎకరాల్లో పంటలకు నష్టం
సీఎం పరామర్శించి వెళ్లినా
అందని సాయం
అసెంబ్లీ సమావేశాల్లో
చర్చకు వచ్చేనా?


