● శ్రేణులతో కలిసి నడుస్తున్న
గంప, షబ్బీర్ తనయులు
● సభలు, సమావేశాలకు హాజరు
● పరామర్శలకూ వెళుతున్నారు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి నియోజకవర్గంలో కీలక నేతల వారసులు ఇటీవలి కాలంలో పాలిటిక్స్‌లో యాక్టివ్ అయ్యారు. కొన్నేళ్లుగా తండ్రుల వెంట తిరుగుతున్నప్పటికీ ఈ మధ్యన పార్టీ శ్రేణుల వెంట నడుస్తున్నారు. ఓ రకంగా రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ తనయుడు ఇలియాస్ చాలా కాలంగా రాజకీయాల్లో తిరుగుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఫుల్ టైమర్‌గా మారారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జీ గంప గోవర్ధన్ తనయుడు గంప శశాంక్ గత కొన్నేళ్లుగా తిరుగుతున్నప్పటికీ ఈ మధ్యకాలంలో యాక్టివ్ అయ్యారు. పార్టీ శ్రేణులతో కలిసి పెళ్లిళ్లు, ఫంక్షన్లకు హాజరవడంతోపాటు పరామర్శలకూ వెళుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో అమలు చేస్తామన్న 420 హామీలు వెయ్యి రోజులైనా అమలు చేయలేదని బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన వారం రోజుల పోరుబాటలో గంప శశాంక్ చురుగ్గా పాల్గొంటున్నారు. శనివారం కామారెడ్డిలో నిర్వహించిన విద్యార్థి, యువత నిరసన కార్యక్రమానికి శశాంక్ నాయకత్వం వహించారు. విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. నిజాంసాగర్ చౌరస్తా వద్ద జరిగిన ధర్నాలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. నియోజకవర్గంలో రెగ్యులర్‌గా తిరుగుతున్న శశాంక్ పార్టీలో యువకులతో కలిసిపోతున్నారు. తనకంటూ క్యాడర్‌ను తయారు చేసుకుంటున్నారు. షబ్బీర్‌అలీ తనయుడు ఇలియాస్ పార్టీ కార్యక్రమాలతోపాటు ఆలయాల ఉత్సవాలకు హాజరవుతున్నారు. పార్టీకి చెందిన వారెవరైనా చనిపోయినపుడు పరామర్శిస్తున్నారు. ఇలియాస్ వెంట పార్టీ నేతలు, శ్రేణులు కదులుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అవమానం, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌పై కేసులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఇలియాస్ పాల్గొన్నారు. ఇలియాస్ పేరెత్తగానే శ్రేణులు ఈలలు వేస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఇలా ఇద్దరు ముఖ్య నేతల తనయులు రాజకీయాల్లో యాక్టివ్ అవుతుండడంతో వాళ్ల గురించి చర్చ నడుస్తోంది. ఆయా పార్టీల్లో యువ నాయకత్వం వారిని అనుసరిస్తోంది.


