కామారెడ్డి టౌన్: సర్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ అధికారులు నోటీసులు జారీ చేస్తుండటంతో ఓట ర్లు అయోమయానికి గురవుతున్నారు. ఎన్యూమరేషన్ ఫారంలో చిన్న అక్షర దోషం ఉన్నా అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో ఆ నోటీసులకు సమాధానంగా ఏయే ఆధారాలు సమర్పించాలో తెలియక ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పరిష్కారం కోసం బీఎల్‌వోల వద్దకు పరుగులు తీస్తున్నారు. కాగా, నోటీసు అందుకున్న వ్యక్తులు తమ సొంత గుర్తింపు కార్డులతోపాటు తల్లి లేదా తండ్రికి సంబంధించిన ఏవైనా రెండు ధ్రువపత్రాలను సమర్పించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన బీఎల్‌వోలు ఓటర్ల నుంచి ఆధారపత్రాలను స్వీకరించారు.


