కామారెడ్డి క్రైం: ఫిర్యాదులను స్థానికంగానే స్వీకరించి సమస్యలను క్షేత్రస్థాయిలోనే ఎక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది. అయినా ప్రజలు మాత్రం జిల్లా కేంద్రం వైపే వస్తున్నారు. మండల స్ధాయిలో సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం రావాలంటే ఇంకా సమయం పట్టేలా ఉంది. ప్రజలు తమ ఫిర్యాదులను కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 52 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, మార్పులు, చేర్పులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు లాంటి ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్క రించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ పలు శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మండలాల్లో ప్రజావాణి ప్రారంభించినా ..
కలెక్టరేట్ వైపే మొగ్గుచూపుతున్న
ఫిర్యాదుదారులు
52 వినతులు స్వీకరించిన
కలెక్టర్, అఽధికారులు


