తాడ్వాయి : గ్రామాల్లో సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు సూచించారు. మండలంలోని చిట్యాల గ్రామంలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చే మోస పూరిమైన ఫోన్‌కాల్స్‌ను నమ్మవద్దన్నారు. ప్రస్తుతం జాబ్ నోటిఫికేషన్ విడుదలయిందని, ఈ నోటిఫికేషన్‌ను యువకులు వినియోగించుకోవాలని సూచించారు. డ్రగ్స్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామంలో సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ద్విచక్రవాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించాలన్నారు. అత్యవసర సమయంలో 112 నంబరుకు డయల్ చేయాలన్నారు. ఎస్‌ఐ నరేశ్, గ్రామపోలీసు యాదగిరి, సర్పంచ్ రంజిత్‌రెడ్డి, కానిస్టేబుల్స్, హోంగార్డులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
రాజంపేట కస్తూర్బా పాఠశాలలో..
రాజంపేట(భిక్కనూరు): రాజంపేట కస్తూర్బా పాఠశాలలో సైబర్ మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్య నిర్మూలనపై ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసు కళాజాత బృందం సోమవారం అవగాహన కల్పించారు. కళాజాత బృందం ఇన్‌చార్జి రామంచ తిరుపతి ఆధ్వర్యంలో విద్యార్థులకు పాటల రూపంలో వివరించారు. సోషల్‌మీడియా వాడకంపై జాగ్రత్తగా ఉండాలన్నారు. కళా బృందం సభ్యులు శేషరావు, ప్రభాకర్, సాయిలు, ఏఎస్సై నర్సింగ్‌రావు, షీటీం పీసీ సౌజన్య, బూకోట్స్ పీసీలు స్వామిగౌడ్, పూల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలం ఆంధ్రనగర్ గ్రామ సమీపంలో ఓ వ్యానులో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా సోమవారం సాయంత్రం నందిపేట పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆంధ్రానగర్‌లోని ఒక బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అందులో మొత్తం 57 సంచులలోని 31క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అట్టి బియ్యానికి ఎటువంటి ఆధారాలు వారివద్ద లేకపోవడంతో వాటిని నందిపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ ఖలీమ్‌తోపాటు ఓనర్ మాక్లూర్‌కు చెందిన ఇమ్రాన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్ వెల్లడించారు.


