ఇటీవలి ఘటనలు..
నోటీసులు జారీ చేశాం..
● భారీ వర్షాలకు కూలుతున్న ఇళ్లు
● పాత నిర్మాణాల తొలగింపుపై
దృష్టి సారించని బల్దియా
● భయాందోళనల్లో ప్రజలు
● వారం రోజుల క్రితం బాన్సువాడ బల్దియా పరిధిలోని ఇస్లాంపురా కాలనీలోని ఓ పురాతన ఇల్లు కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
● ఇటీవల కురిసిన వర్షాలకు జండాగల్లీలో ఓ పాత ఇల్లు మట్టి గోడలు కూలాయి.
● గతేడాది తాడ్కోల్ రోడ్డులోగల ఓ దుకాణ సముదాయ భవనం కూలడంతో కార్మికుడికి తీవ్ర గాయమైంది. ఈ ఘటనలో ఓ బైక్ ధ్వంసం అయ్యింది.
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని పాత భవనాలు శిథిలావస్థకు చేరాయి. వర్షాలకు తడిసి కూలిపోతున్నా బల్దియా అధికారులు మేల్కోవడం లేదు. భారీ వర్షాలు కురిస్తే ఏ సమయంలో ఏ ఇల్లు కూలుతుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
బాన్సువాడ తాడ్కోల్ చౌరస్తా, పాత బాన్సువాడలో పలు కాలనీలు, ఇస్లాంపురా, గౌలీగూడ, పొచమ్మ గల్లీ, జండాగల్లీ, కోటగల్లీ తదితర ప్రాంతాల్లో పాత భవనాలున్నాయి. వాటిని అధికారులు పరిశీలించి ఒక వేళ ప్రమాదం పొంచి ఉందని భావిస్తే సంబంధిత భవన యజమానులకు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. పది రోజులలోగా ఆ నోటీసుపై స్పందించకపోతే చివరి నోటీసు జారీ చేసి మరో మూడు రోజుల తర్వాత శిథిలమైన నిర్మాణాలను తొలగించాలి. కానీ శిథిలావస్థకు చేరిన పాత భవనాలను గుర్తించడంలో బల్దియా టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి. గతంలో మోటారు వైండింగ్ షాప్‌లో పెచ్చులూడి పడిన ఘటనలో అక్కడ పనిచేస్తున్న వ్యక్తి తలకు తీవ్ర గాయమైంది. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటున్నాయి.
పట్టించుకోని అధికారులు..
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న భవనాలు, వాటి స్థితిగతులు, వాటి జీవిత కాలం ఎన్నేళ్లు అనే అంశాలను టౌన్‌ప్లానింగ్ విభాగం ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలో శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర పురపాలక ఉన్నతాధికారులు గతంలో ఆదేశాలు జారీ చేసినా సంబంధిత అధికారులు స్పందించడం లేదు. భారీ వర్షాలు కురిస్తే శిథిలావస్థకు చేరిన భవనాలు కూలిపోయి ప్రమాదాలబారిన పడే అవకాశాలున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి క్షేత్ర స్థాయిలో పరిశీలించి, శిథిలావస్థకు చేరిన భవనాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బాన్సువాడ బల్దియా పరిధిలో ఇప్పటివరకు 22 పురాతన ఇళ్లను గుర్తించి, వాటి యజమానులకు నోటీసులు జారీ చేశాం. వారు ఇళ్లను నేలమట్టం చేసుకోవాలి. లేదంటే మున్సిపల్ ఆధ్వర్యంలో కూల్చివేస్తాం.
– గంగాధర్, మున్సిపల్ కమిషనర్, బాన్సువాడ


