నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టునుంచి శుక్రవారం నీటి విడుదలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రాజెక్ట్ గేట్లను పైకెత్తి ప్రధాన కాలువలోకి నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఎస్‌ఈ యశస్వి మాట్లాడుతూ ఖరీఫ్ పంటల సాగు కోసం నాలుగు విడతల్లో ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. వరుసగా 15 రోజులపాటు నీటిని విడుదల చేస్తామని, తర్వాతి 10 రోజులు నిలిపివేస్తామని పేర్కొన్నారు. ఇలా నాలుగు విడతల్లో నీటిని విడుదల చేస్తామన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టులో నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
ప్రాజెక్టు అభివృద్ధికి రూ. 5.18 కోట్లు..
పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇటీవల రూ. 5.18 కోట్ల నిధులను మంజూరు చేసిందని ఇరిగేషన్ ఎస్‌ఈ యశస్వి తెలిపారు. ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టు కుడివైపు గల వంతెన వద్ద రిటెయినింగ్ వాల్ నిర్మాణానికి రూ. 1.24 కోట్లు, ప్రాజెక్ట్ అలుగుపై మైనర్ రిపేర్ల కోసం రూ.2.34 కోట్లు మంజూరయ్యాయన్నారు. దీంతోపాటు ఎల్లారెడ్డి మండలంలోని అడ్విలింగాల వద్ద పోచారం ప్రధాన కాలువ సైడ్ వాల్స్ నిర్మాణానికి రూ.1.60 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభమయ్యేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్‌పర్సన్ రజితరెడ్డి, ఇరిగేషన్ డీఈఈ కిష్టయ్య, ఏఈ అక్షయ్ కుమార్, తాండూర్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మురళీమోహన్ గౌడ్, పోచారం, నాగిరెడ్డిపేట సర్పంచులు సంజీవరావు, వెంకట్, నాయకులు రాంచందర్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, విక్రాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కిష్టయ్య, కిరణ్ కుమార్, శ్రీరాంగౌడ్, సురేందర్ గౌడ్, సాయాగౌడ్, మహేష్‌రెడ్డి, కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


