బాన్సువాడ : కళాశాలకు బస్సు సౌకర్యం లేక ఇబ్బందిపడుతున్న విద్యార్థుల సమస్యపై ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. దీంతో సమస్య పరిష్కారమైంది. వివరాలిలా ఉన్నాయి. పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ నుంచి తిమ్మాపూర్ వెంకటేశ్వర ఆలయానికి వెళ్తూ మార్గమధ్యలో బీర్కూర్ మండలం కిష్టాపూర్ బస్టాండ్ వద్ద వేచి ఉన్న విద్యార్థులను చూసి ఆగారు. వారితో మాట్లాడగా.. ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలకు డైరెక్ట్ బస్సు సౌకర్యం లేకపోవడంతో బాన్సువాడకు వెళ్లి అక్కడి నుంచి మరో బస్సు ఎక్కి కళాశాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. సమయానికి బస్సులు లేకపోవడంతో తరగతులకు ఆలస్యంగా వెళ్తున్నామని వివరించారు. దీంతో పోచారం వెంటనే బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రోజూ బాన్సువాడ నుంచి బీర్కూర్, తిమ్మాపూర్, బొమ్మన్‌దేవ్‌పల్లి చౌరస్తా, దుర్కి మీదుగా ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాల వరకు ప్రత్యేక బస్సు నడపాలని సూచించారు. తమ సమస్యపై వెంటనే స్పందించి, తక్షణ పరిష్కరం చూపిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.
నిజాంసాగర్: నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును ఈనెల 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రాంబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 11, 12 తేదీల్లో దరఖాస్తు పత్రాల్లో తప్పుల సవరణకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కామారెడ్డి అర్బన్: జిల్లా కేంద్రంలో శుక్రవారం జిల్లా స్థాయి యోగాసన చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. పోటీలలో 220 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. యోగా ట్రెడిషనల్, ఆర్టిస్టిక్, రిథమిక్ విభాగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమారాణి, యోగాసన అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, కార్యదర్శి రఘుకుమార్, యోగాచార్యులు అంజయ్య, జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


