సర్వీస్ రోడ్డు పనులు ప్రారంభిస్తాం
సర్వీస్ రోడ్లు లేక ఇబ్బందులు
నిజాంసాగర్(జుక్కల్): హైదరాబాద్–బోధన్ రహదారి విస్తరణ పనులు నత్తేనయం అన్నట్లుగా సాగుతున్నాయి. ఏడాదిన్నర కిందట మహమ్మద్‌నగర్ మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనుల కోసం ఇళ్లను కూల్చి, గుంతలు తవ్వి వదిలేశారు. సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రధాన రహదారిపై వాహనాల పార్కింగ్ కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
అటవీ శాఖ నుంచి అనుమతులు రాక
నిలిచిన పనులు
హైదరాబాద్– బోధన్ ఎన్‌హెచ్ (765 డి)లో రూ.313 కోట్ల నిధులతో ఎల్లారెడ్డి– రుద్రూర్ వరకు 51.6 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారు. ఎల్లారెడ్డి, మహమ్మద్ నగర్, బాన్సువాడ మండలాల్లోని అటవీ ప్రాంతంలో రహదారి విస్తరణ పనులకు అటవీ శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో పనులు నిలిచాయి. మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు రెండు వైపులా డ్రెయినేజీ నిర్మించారు. మధ్యలో ఒక పక్కన బీటీ సింగిల్ లేయర్ వేసి వదిలేశారు. తద్వారా క్రాస్‌గా ఉన్న బీటీ లేయర్‌తో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
తరుచుగా యాక్సిడెంట్స్
● ఈ నెల 18న మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో రెండు ద్విచక్రవాహనాలు ఎదురురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన పెద్దగొళ్ల సందీప్ (22) అనే యువకుడు ఈ నెల 23న మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బూర్గుల్ గ్రామానికి చెందిన తండ్రి కుమ్మరి రాజు, అతని కూతురు శివాణి నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
● ఈ నెల 17న మహమ్మద్ నగర్ మండల కేంద్రం శివారులోని పెద్ద వాగు వంతెన వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
● గతేడాది కాలంలో ఎల్లారెడ్డి, మహమ్మద్ నగర్ మండలాల్లో రోడ్డు విస్తరణ పనులతో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నర్వ, గాలీపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
ఎల్లారెడ్డి– రుద్రూర్ రహదారి విస్తరణ పనులు ఇప్పటి వరకు 70శాతం పూర్తయ్యాయి. రూ. 210 కోట్ల బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించాం. అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో విస్తరణ పనులు ఆలస్యం అవుతున్నాయి. మహమ్మద్ నగర్ నగర్‌లో రెండు, మూడు రోజుల్లో సర్వీస్ రోడ్డు పనులు ప్రారంభిస్తాం.
– వినోద్, ఏఈఈ, నేషనల్ హైవే
ప్రధాన రహదారికి రెండు వైపు లా సర్వీస్ రోడ్లు వేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడతున్నాం. ప్రధాన రహదారిపై వాహనాలు పార్కింగ్ చేస్తే, ప్రమాదాలు జరుగుతున్నా యి. సర్వీస్ రోడ్ల కోసం ఇళ్లను కూల్చి, గుంతలు తవ్వినా రోడ్లు వేయలేదు. – ఒడిగే గణపతి,
హోటల్ నిర్వాహకుడు,మహమ్మద్‌నగర్
హైదరాబాద్– బోధన్ ఎన్‌హెచ్
(765 డి) రహదారి విస్తరణ పనుల్లో జాప్యం
మహమ్మద్‌నగర్‌లో గుంతలు తవ్వి, ఇళ్లను కూల్చినా నిర్మించని సర్వీస్ రోడ్లు
పట్టించుకోని అధికారులు


