● మహిళల రక్షణకు హెల్ప్‌లైన్లు
● ఫోన్ చేసి సహాయం పొందాలని సూచిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ఎల్లారెడ్డి: మహిళల భద్రత, రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సహాయక చర్యలు తీసుకుంటున్నాయి. 365 రోజులు 24 గంటలు పనిచేసేలా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిళలపై దాడులు జరిగినా, గృహ హింసకు గురైనా బాధితులు ఈ సహాయక కేంద్రాలకు ఫోన్ చేసి రక్షణ, వైద్య సదుపాయం పొందవచ్చు. ఈ హెల్ప్ సెంటర్లకు బాధితులు ఫోన్ చేస్తే పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులను అలెర్ట్ చేసి సమస్యలను పరిష్కరిస్తారు. మహిళల రక్షణకు ఏర్పాటు చేసిన హెల్ప్ సెంటర్ల ఫోన్ నెంబర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
● 100 – అందరికి పరిచయమున్న నెంబర్. మహిళలు, విద్యార్థినులు, యువతులను ఎవరైనా వే ధిస్తే ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే వెంటనే పోలీసు లు, వైద్య, అంబులెన్స్‌ల సహాయం లభిస్తుంది.
● 181 – దేశవ్యాప్త మహిళా హెల్ప్‌లైన్...365 రోజులు 24 గంటలు అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్. పోలీసు, వైద్య, న్యాయ సహాయం ఈ నెంబర్ ద్వారా బాధితులు పొందవచ్చు.
● 121 – ఎమెర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్...ఈ నెంబర్ ద్వారా మహిళలు పోలీసు, ఫైర్ డిపార్ట్‌మెంట్ల సహాయం పొందవచ్చు.
● 1091 – పోలీసుల మహిళల సహాయక కేంద్రం. ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే మహిళలకు పోలీసుల నుంచి సహాయం లభిస్తుంది.
● 1098 – చైల్డ్ హెల్ప్‌లైన్. ఈ నెంబర్ ద్వారా బాలికల రక్షణ, బాల్య వివాహాల నిరోధం లాంటి సేవలు అందుతాయి. బాల బాలికలతో వెట్టిచాకిరీ చేయించడం, పారిశ్రామిక, ప్రమాదకర కర్మాగారాల్లో పనులు చేయిస్తున్నప్పుడు ఈ నెంబర్‌కు ఫోన్ చేసి రక్షణ పొందవచ్చు. అధికారు లు వెంటనే స్పందించి వారికి విముక్తి కల్పిస్తా రు. బాలబాలికలపై హింస, లైంగిక దాడులు జరిగితే కూడా ఈ సెంటర్ ద్వారా సహాయం పొందవచ్చు.
● 1930 – సైబర్ నేరాల బాధితుల కోసం. కొందరు నేరస్తులు సోషల్ మీడియా ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని వారితో అసభ్యకరంగా వ్యవహరించడం, పోస్టులు పెడితే ఈ నెంబర్‌కు డయల్ చేస్తే పోలీసుల ద్వారా సహాయం లభిస్తుంది. ఆన్‌లైన్‌లో ఆర్థిక నేరాలు పాల్పడిన వారిపై ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి న్యాయం చేస్తారు.
● 87126 62662 – తెలంగాణ రాష్ట్ర సైబర్ క్రైం హెల్ప్‌లైన్...తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగం సైబర్ నేరాల గురించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్. సైబర్ నేరాల ద్వారా మోసపోయినప్పుడు ఈ నెంబర్ ద్వారా సహాయం పొందవచ్చు.
● 15100 – జాతీయ న్యాయ సహాయక కేంద్రం. కోర్టుల్లో న్యాయవాదులు పెట్టుకోలేని మహిళలు ఈ ఫోన్ నెంబర్‌కు డయల్ చేస్తే ప్రభుత్వ న్యాయవాదిని ఏర్పాటు చేస్తారు.
● 14490 – జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ). ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే ఆపదలో ఉన్న మహిళలకు జాతీయ మహిళా కమిషన్ ద్వారా వైద్య సహాయం, పోలీసు రక్షణ, వన్ స్టాప్ సెంటర్ సేవలు లభిస్తాయి.


