మానవత్వం చాటిన లింగంపల్లి గ్రామస్తులు
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపల్లి గ్రామానికి చెందిన బోదెల శేఖర్ దంపతుల కూతురు రుచిత(1.8 సంవత్సరాలు) ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతుండటంతో మంగళవారం హైదరాబాదు కొంపల్లిలోని సాయి సిద్ధార్థ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. దీంతో శేఖర్ దంపతులు ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ ప్రత్యూషకు వివరించారు. సర్పంచ్ పిలుపు మేరకు గ్రామస్తులు విరాళాలు సేకరించారు. రూ.లక్ష జమ చేసి చిన్నారి తల్లికి అందజేశారు. మంగళవారం రాత్రి ఆపరేషన్ చేశారు. చిన్నారికి ఎలాంటి అపాయం లేదని వైద్యులు చెప్పినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్‌కు సహకరించి బిడ్డ ప్రాణాలు కాపాడిన గ్రామ సర్పంచ్ ప్రత్యూష, సాయిరాం, ఉపసర్పంచ్ దాసారం సంతోష్, భానుచందర్‌గౌడ్, లక్ష్మణ్, ఆనంద్, నవీన్, అనిల్‌తో పాటు గ్రామస్తులకు శేఖర్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.


