ఎక్కడున్నా.. వచ్చి ఓటేయన్నా..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మున్సిపాలిటీల పరిధిలో ఓటు ఉండి స్థానికంగా ఉండని ఓటర్ల వివరాలు సేకరించిన అభ్యర్థులు.. వారికి ఫోన్లు చేస్తున్నారు. ఎక్కడున్నా వచ్చి ఓటేసి వెళ్లాలని కోరుతున్నారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో చాలా మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. కొందరు అద్దె ఇంట్లో ఉన్నపుడు వారి ఓట్లు అక్కడ నమోదు చేసుకుని, తర్వాత సొంత ఇళ్లు కట్టుకుని వేరే చోటుకు వెళ్లారు. మరికొందరు వేరే అద్దె ఇంట్లోకి మారారు. ఇలా చాలా మంది ఓట్లున్నాయి. ప్రతి వార్డులో వందల సంఖ్యలో స్థానికంగా ఉండని ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున పోల్ మేనేజ్‌మెంట్ చేస్తున్న వారు స్థానికంగా ఉండని వారిపై ఫోకస్ చేసి వారి వివరాలను సేకరించారు. వలస వెళ్లిన వారిలో తమకు వచ్చే ఓట్లు ఎన్ని అన్న లెక్కలు వేసుకుని, అనుకూలంగా ఉన్న వారికి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. తమవారు కాదనుకున్న వారికీ ఫోన్లు చేస్తున్నారు. ఈనెల 11న జరిగే ఓటింగ్‌కు రావాలని కోరుతున్నారు. రాకపోకలకు అయ్యే ఖర్చులను భరిస్తామని, కుటుంబంలో ఉన్న ఓట్ల ఆధారంగా ఓటుకు ఇంత ఇస్తామని ప్రలోభపెడుతున్నారు. స్థానికంగా వేరే వార్డుల్లో ఉన్న వారికి మద్యం, డబ్బులు ఆఫర్ చేస్తున్నారు. కొందరికి ఇప్పటికే డిజిటల్ పేమెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎక్కడెక్కడో ఉన్న వారు ఓటేయడానికి రావచ్చని భావిస్తున్నారు.
అడ్రస్ లేని వారెందరో...
ఓటరు జాబితాల్లో పేర్లు ఉన్న వారిలో కొందరికి సంబంధించిన సమాచారం దొరకడం లేదని తెలుస్తోంది. కొన్ని కుటుంబాల ఫోన్ నంబర్లు కూడా ఎవరి వద్దా లేవు. కాంటాక్ట్ నంబర్లు దొరక్కపోవడతో వారిని పక్కన పెట్టేస్తున్నారు.
స్థానికంగా ఉండని
ఓటర్లకు అభ్యర్థుల ఫోన్లు
పోలింగ్ రోజు రావాలంటూ
వేడుకోలు
ఎంత ఖర్చయినా
ఇస్తామంటున్న పలువురు..


