‘నిర్భయంగా ఓటు వేయండి’
కామారెడ్డి క్రైం: ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం కోసం జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. కొత్త పట్టణంలోని శిశుమందిర్ పాఠశాల నుంచి ప్రారంభమైన పోలీసుల కవాతు బస్టాండ్, నిజాంసాగర్ చౌరస్తా, బడా మజిద్, పాంచ్‌రస్తా, డెయిలీ మార్కెట్, భరత్ రోడ్, రైల్వే స్టేషన్, సిరిసిల్ల రోడ్ మీదుగా రాజీవ్ పార్క్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగిసిందన్నారు. అభ్యర్థులు గానీ, వారి మద్దతుదారులు గానీ ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు మద్యం, డబ్బు, బహుమతులు వంటి ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దన్నారు. అలాంటి సమాచారం ఏదైనా ఉంటే డయల్ 100 కు ఫోన్ చేసి చెప్పాలన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు చేయకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుందన్నారు. ప్రతి కదలికను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఆర్డీవో వీణ, పట్టణ సీఐ నరహరి, రూరల్ సీఐ రామన్, వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


