ప్రమాదపుటంచు..
అనారోగ్య సమస్యలు రాకుండా..
పొగమంచు..
బీబీపేటలో మంచు దుప్పటి
వాతావరణంలో మార్పులతో జిల్లాలో రెండు మూడు రోజులుగా భారీగా పొగమంచు కురుస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత పొగమంచు వ్యాప్తి మొదలై ఉదయం తొమ్మిది దాటిన తర్వాత కూడా పూర్తిగా వీడడం లేదు. దట్టంగా కమ్ముకున్న పొగమంచు ప్రమోదాన్నిస్తున్నా.. ప్రమాదాన్నీ తెస్తోంది. దట్టంగా పొగ మంచు కమ్ముకోవడం వల్ల వెలుతురు తగ్గిపోతోంది. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతున్నాయి. కొద్ది దూరంలో ఉన్నవి కూడా కనిపించడం లేదు. హెడ్‌లైట్లు వేసుకుని వస్తున్నా ఇబ్బందిగానే ఉందని వాహనదారులు పేర్కొంటున్నారు. గురువారం వేకువజామున కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలో పొగమంచుతో కారు నడుపుతున్న యువకుడికి దారి కానరాక ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. శుక్రవారం వేకువజామున బయటకు వెళ్లిన వారంతా ఇబ్బందులు పడ్డారు.
భారీ వాహనాల డ్రైవర్లకూ ఇబ్బందే...
జిల్లా మీదుగా ఎన్‌హెచ్–44, ఎన్‌హెచ్–161, ఎన్‌హెచ్–765 డీ తదితర జాతీయ రహదారులున్నాయి. జాతీయ రహదారులతోపాటు ఇతర రహదారులపై బస్సులు, లారీలు, ఇతర వాహనాల రాకపోకలకు పొగమంచు ఇబ్బంది కలిగిస్తోంది. మంచు మూలంగా కొందరు వాహనదారులు రోడ్ల పక్కన వాహనాలను నిలిపి విశ్రాంతి తీసుకుంటున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారులపై వాహనాలు నిలపడం కూడా ప్రమాదకరంగా మారింది. పొగమంచుతో రోడ్డు కనబడక, ఆగిన వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. ఎటువైపు నుంచి ఏ వాహనం వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఎదురుగా వచ్చే వాహనాలు లైట్లు వేసుకున్నా, దగ్గరికి వెళ్లేదాకా కనబడడం లేదని డ్రైవర్లు చెబుతున్నారు.
చాలామంది గ్రామాలనుంచి పట్టణాలకు పాలు, కూరగాయలు, ఇతర వస్తువులు తీసుకుని తెల్లవారకముందే వస్తుంటారు. వారంతా పొగమంచుతో అవస్థలు పడుతున్నారు. పొద్దున్నే ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు.. మంచుతో దారి కానరాక పార్కింగ్ లైట్లు, లైట్లు వేసుకుని మెల్లిగా కదులుతున్నారు. ఉదయం 9 దాటినా చాలా ప్రాంతాల్లో పొగమంచు తగ్గడంలేదు. సాధారణంగా శీతాకాలంలో మంచు కురుస్తుంది. అయితే ఇప్పుడు గంటల తరబడిగా పొగమంచు కమ్మేస్తుండడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. ప్రమాదాలు జరుగుతాయన్న భయంతో చాలా మంది ఉదయం ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. తప్పనిసరిగా వెళ్లాల్సిన వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ముందుకు కదులుతున్నారు. దూరప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ఉద్యోగులు తెల్లవారుజామునే బయలుదేరుతారు. వారంతా పొగమంచుతో ఇబ్బందిపడుతున్నారు.
చలి వాతావరణంలో అనారోగ్య సమస్యలూ తలెత్తే అవకాశాలు ఉంటాయి. చల్లని గాలి ముక్కు, చెవుల ద్వారా లోపలికి చేరి ఊపిరితిత్తుల్లో కఫం పెరిగి ఇన్‌ఫెక్షన్లకు దారి తీస్తుంది. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే చెవి లోపలికి చల్లని గాలిపోకుండా చూసుకోవాలి.
అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే ముక్కు, నోరు, చెవులు కప్పిఉంచేలా మంకీ క్యాప్, మాస్క్ ధరించాలి. ఎండ వచ్చాకే వాకింగ్, ఇతర వ్యాయామాలు చేయడం ఉత్తమం.
చలిలో గుండె నాళాలు కుచించుకుపోయి సడన్ కార్డియాక్ అరెస్టుకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. అస్తమా, సీవోపీడీ ఇతర శ్వాసకోశ వ్యాధులు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి.
ఉదయం ఎనిమిది దాటినా
తొలగని మంచు తెరలు
దారి కానరాక అవస్థలు
ప్రమాదాల బారిన పడుతున్న
వాహనదారులు


