పురం.. పోరుకు సన్నద్ధం!
బల్దియాలలో వార్డులు, పోలింగ్ కేంద్రాలవారీగా ఓటర్ల వివరాలు..
కామారెడ్డి టౌన్: బల్దియా ఎన్నికల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి. తుది ఓటరు జాబితా ప్రకటన కు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో జిల్లా లోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలలో ఎన్నికల వేడి పెరుగుతోంది.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 2026 జనవరి 1వ తేదీని ప్రాతిపదికగా తీసుకుని కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. అన్ని మున్సిపాలిటీలలో ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. జనవరి 10వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను కూడా ఇప్పటికే గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తుండడంతో ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అధికారులూ సన్నద్ధమవుతున్నారు. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సుల తనిఖీ, సిబ్బంది నియామకం, శిక్షణ వంటి అంశాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది.
రిజర్వేషన్‌పై ఉత్కంఠ
ఓటర్ల జాబితా వెల్లడైన తర్వాత వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. జనాభా ఆధారంగా ఏ వార్డు ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందన్న అంశంపై రాజకీయ నాయకులు అంచనాలు వేస్తున్నారు. తమకు అనుకూలించే వార్డునుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాలో అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్, బీజేపీ తదితర పార్టీలు పోటీకి సన్నద్ధమవుతున్నాయి. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కై వసం చేసుకున్న కాంగ్రెస్ అదే ఊపులో మున్సిపల్ పీఠాలను హస్తగతం చేసుకోవాలని భావిస్తుండగా.. మరోవైపు పట్టు నిలుపుకోడానికి బీఆర్‌ఎస్, బీజేపీలు కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
పట్టణం వార్డులు పోలింగ్‌కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
కామారెడ్డి 49 126 48,511 51,027 17 99,555
బాన్సువాడ 19 38 11,579 12,599 11 24,189
ఎల్లారెడ్డి 12 24 6,328 6,954 1 13,283
బిచ్కుంద 12 23 6,201 6,556 2 12,759
మున్సిపాలిటీల్లో మొదలైన
ఎన్నికల సందడి
తుది ఓటరు జాబితా ప్రకటనకు
అధికారుల కసరత్తు
రిజర్వేషన్లపై అందరి దృష్టి


