కలిసొచ్చిన నిర్ణయం
ఎందరికో అవకాశం...
● గతంలో ముగ్గురు పిల్లలుంటే
‘స్థానిక’ ఎన్నికల్లో పోటీకి అనర్హత
● నిబంధన ఎత్తేయడంతో మారిన పరిస్థితి
● సర్పంచ్‌గా ఎన్నికై న పలువురు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : గతంలో ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలు ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండేది కాదు. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికలలో ఆ నిబంధన ఎత్తివేయడంతో చాలామందికి పోటీ చేశారు. ఇందులో కొందరు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు.
రాష్ట్రంలో 1994 తరువాత మూడో సంతానం కలిగిన వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకీ అనర్హులుగా నిబంధన తీసుకువచ్చారు. దీంతో ముగ్గురు పిల్లలు ఉన్న చాలామంది పోటీకి అనర్హులయ్యారు. ఈ నిబంధన మూడు దశాబ్దాల పాటు కొనసాగింది. స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించాలన్న ఎందరి అవకాశాలనో ఇది దూరం చేసింది. అయితే ఈ నిబంధన ఉన్నా పలువురు కొత్తదారులు వెతికి పోటీ చేసినవారున్నారు. కొందరు పిల్లల్ని దత్తత ఇచ్చినట్లు, ఇంకా రకరకాల ప్రయత్నాలు చేశారు. అయితే కొన్నిచోట్ల నామినేషన్ల పరిశీలన సమయంలో ప్రత్యర్థులు ఆధారాలు సమర్పించడంతో నామినేషన్లు తిరస్కరణకు గురైన సంఘటనలూ ఉన్నాయి.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయడంతో ఎంతో మంది పోటీ చేశారు. కొందరు సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. దోమకొండ మండల కేంద్రంలో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయడంతో ఐరేని నర్సయ్య, కుంచాల శేఖర్‌లకు పోటీ చేసే అవకాశం లభించింది. ఐరేని నర్సయ్య విజయం సాధించారు. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ సర్పంచ్‌గా మంజుల పోటీ చేసి గెలుపొందారు. మాచారెడ్డి, పాల్వంచ, దోమకొండ, బీబీపేట, సదాశివనగర్, బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లో ముగ్గురు పిల్లలున్న పలువురు సర్పంచులు, వార్డు సభ్యులయ్యారు. రాబోయే రోజుల్లో జరిగే ఇతర స్థానిక సంస్థల ఎన్నిలకల్లోనూ పలువురు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.


