గణితం.. ఆలోచనా శక్తిని పెంచే శాస్త్రం
మాట్లాడుతున్న డీఈవో రాజు
కామారెడ్డి టౌన్: గణితం సంఖ్యల శాస్త్రం మాత్రమే కాదని, అది విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాన్ని పెంపొందించే మహత్తర విద్య అని డీఈవో రాజు పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గంజ్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి గణిత ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంచాలనే లక్ష్యంతో ఫోరం ఇలాంటి పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఫోరం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తాడ్వాయి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫోరం తీసుకుంటున్న నిర్ణయాలు ఉపాధ్యాయులకు ప్రేరణగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా గణిత ఫోరం అధ్యక్షుడు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నీలం కుమారస్వామి, కోశాధికారి నరేందర్, గణిత ఉపాధ్యాయులు శివ, వెంకటి, నరసింహన్ తదితరులు పాల్గొన్నారు.


