సమయపాలన పాటించని ఉపాధ్యాయులు
పిట్లం(జుక్కల్): మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదు. పిట్లం ప్రభుత్వ జిల్లా ప్రజా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 20 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా మంగళవారం ఉదయం ప్రార్థనలో ముగ్గురు మాత్రమే పాల్గొన్నారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 14 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా ఒక్కరు మాత్రమే ప్రార్థనలో పాల్గొన్నారు. ఉర్దూ మీడియం పాఠశాలలో ఆరుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా ఇద్దరు మాత్రమే ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు మొబైల్ యాప్‌లో ఆన్‌లైన్ అటెండెన్స్ వేయాల్సి ఉన్నా ఉపాధ్యాయులు ఉదయం ప్రార్థనలో ఎందుకు పాల్గొనడం లేదని, లేదా పాఠశాలకు వచ్చి అటెండెన్స్ వేసుకొని వెళ్లి పోతున్నారా లేదా పాఠశాలకు ఎప్పుడు వస్తే అప్పుడే అటెండెన్స్ వేసుకుంటున్నారా అని పలువురు చర్చించుకున్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రమాణాలు నేర్పించి, భవిష్యత్తులో వారిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లవలసిన ఉపాధ్యాయులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, కాలయాపన చేయడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఎంఈవో దేవిసింగ్‌కు వివరణ కోరగా పలువురు పాధ్యాయులు కాంప్లెక్స్ మీటింగ్‌కు వెళ్లారని తెలిపారు.
సమయపాలన పాటించని ఉపాధ్యాయులు


