చికిత్స పొందుతూ బాలుడి మృతి
అవయవ దానం చేసిన తల్లిదండ్రులు
నందిపేట్(ఆర్మూర్): తనపై దొంగతనం నెపం వేయడంతో బాలుడు ఆత్మహత్యకు యత్నించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కొడుకు మృతి బాధను దిగమింగుకొని అవయవదానానికి తల్లిదండ్రులు ముందుకువచ్చారు. వివరాలు ఇలా.. నందిపేట మండలం బాద్గుణ గ్రామానికి చెందిన బరుకుంట ముత్తెన్న తన డబ్బులు రూ. 25వేలు పోయాయంటూ అదే గ్రామానికి చెందిన బరికుంట సన్నిత్ (17)పై దొంగతనం నెపం వేశాడు. దీంతో మనస్తాపం చెందిన సన్నిత్ ఈనెల 27న పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. దీంతో ముత్తెన్నపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యాంరాజ్ తెలిపారు. తమ కొడుకు మృతిచెందడంతో అవయవదానానికి మృతుడి తల్లిదండ్రులు ముత్తెన్న, పోసాని ముందుకువచ్చారు. విషాద సమయంలోనూ ఆదర్శంగా నిలుస్తూ అవయవాలు అందించిన కుటుంబాన్ని గ్రామస్తులు అభినందించారు.


