40 వేలిచ్చినా పని చేస్తలేరంటూ హంగామా ..
ఓ అధికారికి లంచంగా రూ.40 వేలిచ్చినా పని చేయడం లేదని మహ్మద్‌నగర్‌కు చెందిన తూర్పాటి చంద్రవ్వ ఆరోపించారు. సోమవారం ఆమె కలెక్టరేట్‌లోని ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యాలయానికి వచ్చారు. కార్యాలయం ఎదుట బైఠాయించి దాదాపు గంటపాటు నానా హంగామా చేశారు. ఆమె మాట్లాడుతూ.. తన భర్త చిన్న దానయ్య పేరిట రెండేళ్ల క్రితం వెల్డింగ్ యూనిట్ కోసం దళితబంధు పథకం మంజూరైందన్నారు. రూ.10 లక్షలు చిన్నదానయ్య అకౌంట్‌లో జమ కూడా అయ్యాయన్నారు. ఆ విషయం తెలిసే లోపే అప్పుల బాధ భరించలేక తన భర్త చిన్న దానయ్య పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది. తన భర్త అకౌంట్ నుంచి దళితబంధు మొత్తాన్ని తన అకౌంట్‌కు బదిలీ చేయాలని రెండేళ్లుగా తిరుగుతున్నానని వాపోయింది. ప్రక్రియ మొత్తం పూర్తి చేసిన అధికారులు రూ.3 లక్షలు లంచం డిమాండ్ చేశారనీ, తన దగ్గర అంత మొత్తం లేకపోవడంతో బ్రతిమిలాడుకుని రూ.40 వేలు ఓ అధికారికి ఇచ్చానని ఆమె చెబుతోంది. డబ్బులు ఇచ్చినా ఫైలు ముందుకు కదపడం లేదని ఆరోపిస్తూ కార్యాలయం ముందర నేలపై కూర్చుని గంటకు పైగా శోకం పెడుతూ బైఠాయించింది చంద్రవ్వ. పోలీసులు కలుగజేసుకుని ఉన్నతాధికారులతో మాట్లాడిస్తామంటూ సర్ది చెప్పి పంపారు.


