కంకర ప్లాంట్ ఏర్పాటును నిలిపివేయాలి
శివారులో జరుగుతున్న కంకర ప్లాంట్ ఏర్పాటు పనులను నిలిపివేయాలని కోరుతూ బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన వడ్డెర కులస్తులు సోమవారం ప్రజావాణికి తరలివచ్చారు. వారు మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన దాదాపు 200 కుటుంబాలు తాతల కాలం నుంచి గ్రామ శివారులోని గుట్టమీద ఉన్న బండలు పగులగొట్టుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని తెలిపారు. చుట్టూ 350 ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయని అన్నారు. కంకర మిషన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే భారీ పేలుళ్లకు వ్యవసాయ భూముల్లోని బోర్లు ఎత్తిపోయి రైతు మనుగడ కష్టమవుతుందన్నారు. కంకర ప్లాంట్ ఏర్పాటును తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.


