అందని స్కానింగ్ సేవలు
కామారెడ్డి టౌన్: పేదలకు ఉచితంగా అధునాతన వైద్య పరీక్షలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘టీ–హబ్’ (తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్) లక్ష్యం జిల్లాలో నీరుగారుతోంది. రోగ నిర్ధారణ కోసం వచ్చే రోగులు స్కానింగ్ సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. యంత్రం ఉన్నా నడిపే నాథుడు లేకపోవడంతో దానిని మరోచోటికి తరలించారు. దీంతో స్కానింగ్ అవసరం ఉన్న వారు ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.
ఖాళీగా రేడియాలజిస్ట్ పోస్టు
జిల్లా కేంద్రంలోని నూతన మెడికల్ కళాశాల పక్కన టీ–హబ్ సెంటర్‌లో రక్త పరీక్షలు సజావుగానే జరుగుతున్నప్పటికీ, కీలకమైన రేడియాలజీ విభాగం సేవలు మాత్రం నిలిచిపోయాయి. రేడియాలజిస్ట్ పోస్టు చాలా కాలంగా ఖాళీగా ఉంది. రేడియాలజిస్ట్‌ను నియమించకపోవడంతో రూ. లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన స్కానింగ్ యంత్రం నిరుపయోగంగా మారింది.
జీజీహెచ్‌కు తరలింపు..
టీ – హబ్‌లో వినియోగంలో లేదనే సాకుతో అక్కడి స్కానింగ్ యంత్రాన్ని అధికారులు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)కి తరలించారు. అయితే అక్కడ కూడా రోగుల రద్దీ విపరీతంగా ఉండటం, టెక్నికల్ సమస్యల కారణంగా సామాన్యులకు సకాలంలో స్కానింగ్ సేవలు అందడం లేదు. ముఖ్యంగా గర్భిణులు, అత్యవసర చికిత్స అవసరమైన వారు గంటల తరబడి వేచి చూడలేక ప్రైవేట్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో కేవలం జీజీహెచ్, మూడు ఏరియా ఆస్పత్రుల్లో తప్ప మిగతా సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో ఎక్కడ కూడా స్కానింగ్ సేవలు అందుబాటులో లేవు. దీంతో అపెండిసైటిస్, కడుపునొప్పి, స్టోన్స్, కడుపులో ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. గర్భిణుల నుంచి ఒక్కో అ ల్ట్రాసౌండ్ స్కానన్‌కు రూ.800 నుంచి రూ. 2,000 వరకు ప్రైవేట్ సెంటర్లు దండుకుంటున్నాయి. పేదలు అప్పులు చేసి మరీ పరీక్షలు చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలోని టీ–హబ్‌లో తక్షణమే రేడియాలజిస్ట్‌ను నియమించి, అన్ని రకాల స్కానింగ్ సేవలు ఒకే చోట అందేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై జీజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెరుగు వెంకటేశ్వర్లును వివరణ కోరగా.. డీఎంఈ, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లీ టీ–హాబ్‌లో కూడా స్కానింగ్ సేవలు ప్రారంభమయ్యేలా కృషి చేస్తానని అన్నారు.
టీ – హబ్‌లో యంత్రం ఉన్నా
నిపుణుడు లేడు
యంత్రాన్ని జీజీహెచ్‌కు
తరలించిన అధికారులు
ప్రైవేట్ సెంటర్‌లలో రూ.వేలల్లో ఫీజులు
పట్టించుకోని వైద్యారోగ్య శాఖ


