రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలి
● రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్
● కలెక్టరేట్ వద్ద ఒక రోజు నిరసన దీక్ష
కామారెడ్డి టౌన్: ఉద్యోగ విరమణ చేసినవారికి వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో బుధవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 2024 నుంచి రాష్ట్రంలో సుమారు 16 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయగా కేవలం వెయ్యి మందికే బెనిఫిట్స్ అందాయన్నారు. జీపీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితర బకాయిలు చెల్లంచకపోవడంతో వృద్ధాప్యంలో వైద్య ఖర్చులకు డబ్బుల్లేక అల్లాడుతున్నామన్నారు. పైరవీలు చేసిన వారికే నిధులు అందుతున్నాయని, సామాన్యులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో ఇప్పటివరకు 26 మంది ఉద్యోగులు మరణించారన్నారు. నిలిచిపోయిన రూ. 9వేల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాయంత్రం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందించి, దీక్షను విరమించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంచంద్రం, ఆర్థిక కార్యదర్శి లక్ష్మీరాజం, ప్రతినిధులు మధుసూదన్‌రావు, రాజేశం, రవికుమార్, శంకర్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


