అదుపులో నేరాలు!
ప్రతి ఫిర్యాదును నమోదు చేస్తాం
● తగ్గిన హత్యలు, రోడ్డు ప్రమాదాలు
● ఆపరేషన్ కవచ్‌తో సత్ఫలితాలు..
● 2025 నేర సమీక్షలో
ఎస్పీ రాజేశ్ చంద్ర
‘‘నేరాల నియంత్రణకు జిల్లా పోలీసు శాఖ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో కొన్ని రకాల నేరాలు అదుపులోకి వస్తున్నాయి. జిల్లాలో ఈ ఏడాది హత్యలు, రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి’’ అని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం 2025 నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు శ్రీనివాసరావు, విఠల్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. ఎస్పీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం
జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్‌లలో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు 5,979 కేసులు నమోదయ్యాయి. గతేడాది 6,006 కేసులు రికార్డయ్యాయి.
గతేడాది 37 హత్య కేసులు నమోదవ్వగా.. ఈసారి 34 హత్య కేసులున్నాయి. కాగా జిల్లాలో హత్యాయత్నం కేసులు మాత్రం పెరిగాయి. గతేడాది 20 హత్యాయత్నం కేసులుండగా.. ఈసారి 30 కి చేరాయి. గతేడాది 39 కిడ్నాప్ కేసులు నమోదు కాగా ఈసారి 43 కు పెరిగాయి.
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. 2024 లో 569 ప్రమాదాలు జరిగి 275 మంది మృతి చెందగా 263 మంది గాయాలపాలయ్యారు. ఈ ఏడాది మొత్తం 486 రోడ్డు ప్రమాదాల్లో 211 మంది చనిపోగా మరో 242 మంది గాయపడ్డారు.
పెరిగిన పోక్సో,
అత్యాచారం కేసులు..
మహిళలపై వేధింపులకు సంబంధించి గతేడాది 112 కేసులు నమోదవగా ఈసారి 109కి తగ్గాయి. గతేడాది 61 అత్యాచార కేసులు కాగా ఈసారి 67 కు పెరిగాయి. గతేడాది 89 పోక్సో కేసులు నమోదు కాగా ఈసారి 101 వెలుగుచూశాయి. గతేడాది 312 వరకట్నం, గృహహింస కేసులవగా ఈసారి 247 నమోదయ్యాయి. మొత్తం మహిళా సంబంధిత నేరాలు 2024 లో 517 కేసులవగా.. ఈసారి 526కు పెరిగాయి.
పెరిగిన దోపిడీలు..
చిన్నపాటి దొంగతనాలు మినహా మిగతా దొంగతనాలు, దోపిడీల కేసులు పెరిగాయి. 2024లో 506 చిల్లర దొంగతనాలు జరగ్గా ఈసారి 434 జరిగాయి. తాళం వేసిన ఇళ్లలో చోరీల విషయానికి వస్తే గతేడాది 214 కేసులు నమోదు కాగా ఈసారి 224 నమోదయ్యాయి. గతేడాది 15 దోపిడీ కేసులవగా ఈ సంఖ్య 35 కు పెరిగింది. ఆస్తి సంబంధిత నేరాల్లో 45 శాతం కేసులను ఛేదించి 40 శాతం సొత్తు రికవరీ చేశామని ఎస్పీ తెలిపారు.
జిల్లాలో 2024లో 205 సైబర్ నేరాలు జరగ్గా.. ఈ ఏడాది 160కి తగ్గింది. వాస్తవానికి ఏడాదిలో జిల్లావ్యాప్తంగా మొత్తం 930 ఫిర్యాదులు వచ్చాయి. విచారణ తర్వాత డబ్బులు నష్టపోయిన 160 కేసులను నమోదు చేశారు. ఆయా కేసుల్లో బాధితులు రూ.5.82 కోట్లను పోగొట్టుకోగా.. ఇందులో రూ. 1.07 కోట్లను రికవరీ అయ్యాయి.
‘‘పోలీసు స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును.. అది వాస్తవమైనా, తప్పుడుదైనా సరే కచ్చితంగా రి కార్డు చేస్తాం. ఫిర్యాదు స్వీకరించిన విషయాన్ని ఫి ర్యాదుదారు ఫోన్‌కు మెసేజ్ ద్వారా తెలియజేస్తాం. తక్షణమే కేసు విచారణ చేపట్టి బాధితులకు న్యా యం చేస్తాం’’ అని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నా రు. కొత్త సంవత్సరంలో జిల్లా పోలీసు యంత్రాంగం మరిన్ని నూతన పద్ధతులు అవలంబించనుందని వివరించారు. జిల్లా పోలీసు శాఖ 2025 సంవత్సరంలో అనేక విజయాలు సాధించిందన్నారు. ‘కిడ్స్ విత్ ఖాకీ’ అనే ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పించడంతో పాటు న్యాయం, చట్టం గురించి అవగాహన కల్పించామన్నారు. విద్యార్థులు ఇంటి దగ్గరకు వెళ్లిన తరువాత పేరెంట్స్‌కు తాము నేర్చుకున్న విషయాలను వివరించడం ద్వారా ఎన్నో సత్ఫలితాలు సాధించామన్నారు. వరదల సమయంలో ప్రతి పోలీసు ఎంతో బాధ్యతగా పనిచేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడారని కొనియాడారు.
పోలీస్ వార్షిక నివేదికలో ‘సాక్షి’ కథనం..
జిల్లా పోలీసు శాఖ రూపొందించిన 2025 వార్షిక నివేదికలో ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించారు. వివిధ సందర్భాల్లో పోలీసులు పలువురి ప్రాణాలు కాపాడిన విషయంపై ‘ఆపద్బాంధవులు’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని ఇందులో ప్రముఖంగా ముద్రించారు.
నేరాల నియంత్రణ, ప్రమాదాల నివారణ, ప్రజల భద్రతను పెంచే ఉద్దేశంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఐదు నెలల క్రితం ఆపరేషన్ కవచ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 18 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ 5 నెలల్లో 97,822 వాహనాలను, 26,636 మంది అనుమానితులను తనిఖీ చేశారు. 1,041 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. 64 మంది నిందితులను గుర్తించారు. నంబర్ ప్లేట్ సరిగాలేని 43 వాహనాల సీజ్ చేశారు. రెండు గంజాయి, రెండు పశువుల అక్రమ రవాణా, నాలుగు ఇసుక అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. చోరీకి గురైన ఏడు బైక్‌లు, ఒక ఆటోను గుర్తించి, నిందితులను పట్టుకున్నారు.
అదుపులో నేరాలు!


