గల్ఫ్‌లో ఆగమైన పర్మల్లవాసి
● స్వదేశానికి రప్పించాలి
● సీఎం ప్రవాసీ ప్రజావాణిలో
కుటుంబ సభ్యుల వినతి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన యువకుడు.. రెండు రోజులకే అదృశ్యమయ్యాడు. ప్రభుత్వం చొరవ తీసుకుని అతడిని ఇండియాకు రప్పించాలని బాధితుడి భార్య ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం అందించింది. వివరాలిలా ఉన్నాయి. లింగంపేట మండలం పర్మల్ల గ్రామానికి చెందిన మాలోత్ శ్రీరాం నవంబర్ 11న క్లీనర్ వీసాపై అబుదాబి వెళ్లాడు. అతడు నవంబర్ 13న లేబర్‌క్యాంపు నుంచి అదృశ్యమయ్యాడు. మతిస్థిమితం కోల్పోయి ఎక్కడెక్కడో తిరిగిన శ్రీరాం.. నెల రోజులకు క్యాంపునకు వెళ్లగా అక్కడి నిర్వాహకులు అనుమతించలేదు. కాగా పారిపోయాడంటూ కేసు నమోదు చేసిన కంపెనీ యాజమాన్యం.. డిపోర్టేషన్ కోసం 4,500 దినార్‌లు(రూ.లక్షా పదివేలు) జరిమానా చెల్లించాలని డిమండ్ చేస్తోంది. పేదరికంతో ఉన్న తాము ఆ ఖర్చు భరించే పరిస్థితుల్లో లేమని శ్రీరాం భార్య సునీత ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్తను స్వదేశానికి రప్పించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం అందించింది. అబుదాబిలోని ముసఫా ప్రాంతంలో ఆశ్రయం, ఆహారం లేక రోడ్లపై భిక్షాటన చేస్తూ జీవిస్తున్న తన భర్తను రప్పించాలని తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డిని కోరింది. జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావులు స్పందించి తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది.
గల్ఫ్‌లో ఆగమైన పర్మల్లవాసి


