
గురుకులంలో వైద్య శిబిరం ఏర్పాటు
మద్నూర్: పెద్ద ఎక్లార గేటు వద్ద గల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో మంగళవారం పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వాతావరణ మార్పులతో పలువురు విద్యార్థినులు వాంతులు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని ప్రిన్సిపాల్ స్వప్న తెలపడంతో డోంగ్లీ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 60 మందికి వైద్య పరీక్షలు చేశామని, 15 మందిని బిచ్కుంద ఆస్పత్రికి రిఫర్ చేశామని ఎంఎల్‌హెచ్‌పీ బస్వరాజ్ తెలిపారు. రిఫర్ చేసిన వారి రక్త నమూనాలను సేకరించి వైద్యం అందిస్తామన్నారు. వైద్య శిబిరంలో ఏఎన్‌ఎం స్వరూప, ఆశావర్కర్లు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
సబ్ కలెక్టర్ సందర్శన..
పాఠశాల విద్యార్థులు పలువురు ఆదివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో సిబ్బంది వారిని ఆటోలో బిచ్కుందలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. విషయం తెలుసుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సోమవారం రాత్రి పాఠశాలను సందర్శించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. విద్యార్థినులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నారు.