ఎందుకీ వైపరీత్యం? | - | Sakshi
Sakshi News home page

ఎందుకీ వైపరీత్యం?

Aug 29 2025 6:24 AM | Updated on Aug 29 2025 6:24 AM

ఎందుకీ వైపరీత్యం?

ఎందుకీ వైపరీత్యం?

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణం వర్షాకాలం వచ్చిందంటే చాలు వణికిపోతోంది. వరద ఎక్కడి నుంచి తమ ఇళ్లల్లోకి దూసుకువస్తుందో తెలియని పరిస్థితుల్లో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెద్ద వర్షం కురిస్తే చాలు లోతట్టు ప్రాంతాలే కాదు అభివృద్ధి చెందిన కాలనీలూ నీట మునుగుతున్నాయి. ముఖ్యంగా విద్యానగర్‌, కాకతీయనగర్‌, ఎన్జీవోస్‌ కాలనీ, అశోక్‌నగర్‌ కాలనీల్లో వరద నీరు చాలా చోట్ల ఇళ్లల్లోకి వచ్చి చేరుతోంది. ఇక చెరువు అలుగు పారినపుడల్లా జీఆర్‌ కాలనీ, హౌసింగ్‌ బోర్డు కాలనీలు మునిగిపోతున్నాయి. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. దీనికి కారణం ఏమిటన్న అంశంపై పట్టణంలో చర్చ నడుస్తోంది.

ఆ చెరువుది 128 ఏళ్ల చరిత్ర....

1897లో అప్పటి ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ కామారెడ్డి పెద్ద చెరువును నిర్మించాడని చరిత్ర చెబుతోంది. పట్టణ పరిధిలోని వ్యవసాయ భూములకే కాక, ఇరుగు పొరుగు గ్రామాలైన సరంపల్లి, నర్సన్నపల్లి, క్యాసంపల్లి తదితర గ్రామాలకు చెందిన 9 వందల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వడంతో పాటు పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు దీనిని నిర్మించారు. దీని పొడవు 1.8 కిలోమీటర్లు. చెరువు ఎగువన లింగాపూర్‌ చెరువు ఉంటుంది. తాడ్వాయి మండలంలోని కృష్ణాజీవాడి, లింగాపూర్‌ ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరు కామారెడ్డి చెరువును చేరుతుంది. కాగా కామారెడ్డి పట్టణం విస్తరించడంతో చెరువు నీటిని పంటలకు వదలకుండా తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. చెరువులో నీరుంటే సగం పట్టణంలో భూగర్భ జలాలకు ఇబ్బంది ఉండదు. బీఆర్‌ఎస్‌ పాలనలో చెరువుకు మరమ్మతులు జరిపి మినీ ట్యాంకుబండ్‌గా కొంత మేర అభివృద్ధి చేశారు.

కబ్జాకు గురై కుచించుకుపోయిన వాగు

పెద్ద చెరువు అలుగు పోసినపుడు నీరంతా వాగు ద్వారా ప్రవహించేది. అయితే వాగు చాలా వరకు కబ్జాకు గురైంది. చెరువు దిగువన వాగుకు ఒక వైపు హౌజింగ్‌ బోర్డు కాలనీ మరోవైపు జీఆర్‌ కాలనీ, సరంపల్లి ఉన్నాయి. రెండు వైపులా కబ్జాలు జరిగాయి. దీంతో వాగు విస్తీర్ణం కుచించుకుపోయింది. వాగు ప్రవాహం వేగంగా ఉన్నపుడు విస్తీర్ణం సరిపోకపోవడంతో నీరంతా ఇరువైపులా ప్రవహించి ఇళ్లల్లోకి చేరుతోంది. వరద ప్రవాహం సరిగా లేకపోవడంతో పాత జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–7)పై ఉన్న వంతెనలు దెబ్బతింటున్నాయి. దిగువ భాగంలో కూడా వాగు చాలా వరకు కబ్జాకు గురైంది.

నాలాలు మాయం...

ఎగువభాగం నుంచి వచ్చే వర్షపు నీరు పారడానికి ఉన్న నాలాలు చాలావరకు అన్యాక్రాంతమయ్యాయి. కాకతీయనగర్‌, ఎన్జీవోస్‌ కాలనీ, విద్యానగర్‌ కాలనీ, దేవునిపల్లి, నిజాంసాగర్‌ రోడ్డు తదితర ప్రాంతాల మీదుగా కామారెడ్డి పెద్దచెరువులోకి వెళ్లే నాలాలు చాలా వరకు ఉనికే లేకుండాపోయాయి. దీంతో వర్షం కురిసినపుడల్లా ఆయా కాలనీల్లో నీరు రోడ్లమీద నిలిచిపోయి ఇళ్లను ముంచేస్తోంది. అశోక్‌నగర్‌లోనూ ఇదే పరిస్థితి. నాలాలు కనుమరుగయ్యాయి. పట్టణంలో పలు కుంటలు కనుమరుగై కాలనీలుగా మారాయి. దీంతో వర్షపు నీరంతా ఎక్కడికక్కడే నిలిచిపోయి నీరు ఇళ్లను ముంచెత్తుతోంది. పట్టణంలోని సాయిబాబా ఆలయం ఏటా నీట మునుగుతోంది. స్టేషన్‌ రోడ్డు, సిరిసిల్ల రోడ్లలో ఉన్న నాళాలు, కాలువలు అడ్రస్‌ గల్లంతై వర్షపు నీరు రోడ్లను ముంచెత్తుతోంది.

మనకు కావాలి హైడ్రా...

జిల్లా కేంద్రంలో ఆక్రమణలకు గురైన వాగులు, కుంటలు, నాళాలను దారికి తేవడానికి హైడ్రా లాంటి వ్యవస్థ అవసరం అన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాగులు, కాలువలను పూడ్చి ప్లాట్లుగా మార్చి అమ్ముకోవడం కొందరికి అలవాటుగా మారింది. వారికి ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు అండగా నిలవడంతో అధికారులు అటువైపు చూడడం లేదు. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతతున్నారు.

కబ్జాలతో ఉనికి కోల్పోయిన

పెద్దచెరువు వాగు

అలుగు దూకితే

నీటమునుగుతున్న కాలనీలు

చిగురుటాకులా వణుకుతున్న

జిల్లా కేంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement