
ఉరిమిన మేఘం
బీబీపేట పెద్ద చెరువు పరిశీలన..
వర్షపు నీటిని వేడి చేసుకుని..
రామారెడ్డి రోడ్‌లోని శ్రీకాలనీలో మునిగిన కార్లు
జిల్లాలో వరుణుడు విలయ తాండవం చేశాడు. కుంభవృష్టి కురిపించడంతో వాగులు ఉప్పొంగాయి. ఎటు చూసినా వరద నీరే కనిపించింది. కాలనీలు చెరువులు, కుంటలను తలపించాయి. దీంతో జనజీవనం అతలాకుతలమైంది. వర్షాలతో ఇద్దరు మృత్యువాతపడగా.. వాగులో గల్లంతయిన మరొకరి ఆచూకీ లభించలేదు.
నెమ్లిలో జలమయం అయిన పొలాలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలతో వాగులు పోటెత్తాయి. రెండు రోజుల పాటు దంచికొట్టిన వానతో జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజంపేటలో ప్రహరీ కూలి మీద పడడంతో డాక్టర్ వినయ్ మృతిచెందాడు. దోమకొండ మండలంలో ఎడ్లకట్ట వాగులో కొట్టుకుపోయినవారిలో ఇద్దరు సురక్షితంగా ఇళ్లకు చేరగా.. బాల్‌రాజ్ అనే వ్యక్తి ఆచూకీ లభించలేదు. బీబీపేట మండలం జనగామలో ఎడ్లకట్ల వాగులో చిక్కుకుని రాజిరెడ్డి అనే రైతు మరణించాడు.
135 శాతం అధికంగా నమోదు..
జిల్లాలో ఆగస్టులో సాధారణ వర్షపాతం 224.4 మి. మీ. కాగా 529.0 మి.మీ. వర్షం కురిసింది. 135 శా తం అదనంగా వర్షం పడింది. రాజంపేట, నాగిరెడ్డిపేట, భిక్కనూరు, ఎల్లారెడ్డి, లింగంపేట, కామారె డ్డి, దోమకొండ, నిజాంసాగర్, తాడ్వాయి, రామారె డ్డి, సదాశివనగర్, పాల్వంచ, మాచారెడ్డి, పిట్లం, బీ బీపేట, మహ్మద్‌నగర్, గాంధారి మండలాల్లో రెండు రోజుల్లో 30 నుంచి 60 సెం.మీ. దాకా వర్షం కురిసింది. రాజంపేటలో ఒక్కరోజే రికార్డు స్థాయి లో 494 మి.మీ. వానపడింది. జిల్లాకేంద్రంలో పలువురి వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు కృషి చేశాయి. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్‌చంద్ర క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను అప్రమత్తం చేశారు.
ఆశలను
చిదిమేసింది..
జిల్లాలో వాగులు పొంగి ప్రవహించడంతో వేలాది ఎకరా ల్లో పంటలు నీట మునిగాయి. 55 చెరువులు తెగిపోగా ఏడింటికి మరమ్మతులు చేశారు. 380 గ్రామాలలో 93,925 ఎకరా ల్లో పంటలు నీట మునిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వరి పంట చాలా చోట్ల కొట్టుకుపోయింది. పత్తి, సోయా, మక్క పంటల్లో నీరు నిలవడంతో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. జిల్లాలో 18 గేదెలు, 8 ఆవులు, పదివేల కోళ్లు చనిపోయాయని అధికారులు తెలిపారు.
కూలిన ఇళ్లు..
జిల్లాలో 13 ఇళ్లు పూర్తిగా కూలగా, 310 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఇళ్లు కూలిపోయిన వారికి ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేశారు. జిల్లాకేంద్రంలోని హౌజింగ్ బోర్డు, జీఆర్ కాలనీలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంజీర నది వెంట ఉన్న గ్రామాల్లో కూడా ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
దెబ్బతిన్న రోడ్లు..
పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన 24 రోడ్లు, ఆర్‌అండ్‌బీ శాఖకు సంబంధించిన 34 రోడ్లు ధ్వంసమయ్యాయి. ప్రధానంగా 44 వ నంబరు జాతీయ రహదారిపై పలు చోట్ల వరద పోటెత్తడంతో రోడ్డు ధ్వంసమై రాకపోకలు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి మీదుగా నిజామాబాద్, ఆదిలాబాద్ వెళ్లాల్సిన వాహనాలు చాలాచోట్ల గంటల తరబడి ఆగిపోవాల్సి వచ్చింది. పోచారం ప్రాజెక్టు అలుగు పైనుంచి భారీగా వరద నీరు ప్రవహించడంతో కామారెడ్డి– మెదక్ జిల్లాల మధ్యనున్న వంతెన ముంపునకు గురైంది. వంతెనకు ఇరువైపులా రోడ్డు కోతకు గురై హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటితో గోపాల్‌పేట–ఎల్లారెడ్డి మధ్య రాకపోకలు స్తంభించాయి. తెగిన చోట మరమ్మతులు చేయించి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర రాత్రంతా పర్యవేక్షించారు. రామేశ్వర్‌పల్లి శివారులో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్లను మళ్లించారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం..
భారీ వర్షాలతో స్తంభా లు విరిగిపడడం, వైర్లు తెగిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో 35 చోట్ల విద్యు త్తు సమస్యలు తలెత్తాయి. విద్యు త్ అధికారులు వేగంగా మరమ్మతు లు చేసి 23 చోట్ల పునరుద్దరించారు. 12 చోట్ల ఇంకా విద్యుత్ మరమ్మతులు కొనసాగుతున్నాయి.
వర్షాల నేపథ్యంలో జిల్లాలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం మరో రెండు రోజులపాటు సెలవులు ప్రకటించినట్లు డీఈవో తెలిపారు.
దేమికలాన్ శివారులో ఒరిగిన
మక్క పంట
కాపాడిన చెట్లు..
బుంగపడ్డ బీబీపేట పెద్ద చెరువును రాత్రి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, ఎస్డీఆర్‌ఎఫ్ బృంద సభ్యులు పరిశీలించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో దిగువన ఉన్న షేర్ బీబీపేట గ్రామస్తులను ఖాళీ చేయించారు. వారిని సమీపంలోని తుజాల్‌పూర్‌లో ఏర్పాటు చేసిన షెల్టర్‌కు తరలించారు.
వందలాది మందిని కాపాడిన రెస్క్యూ టీం
కామారెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీలోనుంచి 198 మందిని, హౌజింగ్ బోర్డు కాలనీ నుంచి 60 మందిని బయటకు తీసుకువచ్చారు. ఎస్టీ గురుకులం చుట్టూ నీరు చేరడంతో 300 మంది విద్యార్థులు బయటకు తెచ్చారు. రాజంపేట మడలంలోని పలు గ్రామాల్లో జలదిగ్బంధంనుంచి 29 మందిని కాపాడారు. కామారెడ్డి టీచర్స్ కాలనీలో ఒకరిని, తిమ్మారెడ్డి గ్రామంలో ముగ్గురిని, పాల్వంచలో ఇద్దరిని, గోపాల్‌పల్లిలో ఒకరిని కాపాడారు. మారంపల్లిలో వంద మందిని, ఉగ్రవాయి వద్ద 50 మందిని, నర్వ వద్ద 9 మందిని రెస్క్యూ చేశారు.
జిల్లా కేంద్రంలో వర్షంతో కరెంటు కూడా లేకపోవడంతో ప్యూరిఫైడ్ వాటర్ సమస్య ఏర్పడింది. దీంతో చాలామంది వర్షపు నీటిని బిందెల్లో నింపుకుని, కాచి చల్లార్చుకుని తాగారు. రెండు రోజుల పాటు వర్షం దంచికొట్టడంతో వాటర్ ప్యూరిఫయర్‌లు పనిచేయలేదు. దీనికితోడు రోడ్లు కూడా దెబ్బతినడంతో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో చాలా ఇళ్లలో వర్షపు నీటిని వేడి చేసుకుని తాగారు.
జిల్లాలో కుంభవృష్టి..
అతలాకుతలమైన జనజీవనం
ఉధృతంగా ప్రవహించిన వాగులు..
వరదలతో ఇద్దరు మృతి,
మరొకరి గల్లంతు
93,925 ఎకరాల్లో నీట
మునిగిన పంటలు
విద్యాసంస్థలకు మరో రెండు రోజులు సెలవు ప్రకటించిన విద్యాశాఖ

ఉరిమిన మేఘం

ఉరిమిన మేఘం

ఉరిమిన మేఘం

ఉరిమిన మేఘం

ఉరిమిన మేఘం

ఉరిమిన మేఘం

ఉరిమిన మేఘం

ఉరిమిన మేఘం