
వరద బాధితులను ఆదుకుంటాం
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల పర్యటన
● ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
కామారెడ్డి టౌన్: వరద బాధితులను ఆదుకుంటా మని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క పేర్కొన్నారు. గురువారం ఆమె ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేశ్ షెట్కార్‌లతో కలిసి జిల్లాలోని జాతీయ రహదారి, జీఆర్ కాలనీలను పరిశీలించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్రలతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానికులకు పండ్లు, పులిహోర ప్యాకెట్లను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్ధరాత్రి క్లౌడ్ బరస్ట్ అవ్వడం వల్ల వరద ఉధృతి పెరిగిందన్నారు. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, బాధితులను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని పేర్కొన్నారు. పునరావాస కేంద్రాలలో అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగించాలన్నారు. అప్రమత్తత వల్ల ప్రాణనష్టాన్ని నివారించగలిగామన్నారు.
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. జీఆర్ కాలనీలో బాధితులతో మాట్లాడారు. ఎస్పీ, కలెక్టర్‌లతో మాట్లాడి సహాయక చర్యల గురించి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి జీఆర్ కాలనీని పరిశీలించారు.