
కామారెడ్డి పురం.. అల్లకల్లోలం
కామారెడ్డి టౌన్: మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు కురిసిన భారీ వర్షం కామారెడ్డి జిల్లా కేంద్రంలో అల్లకల్లోలం సృష్టించింది. పట్టణంమంతా జలమయం అయింది. లోతట్టు ప్రాంత కాలనీలన్నీ మునిగిపోయాయి. జిల్లా కేంద్రంలోని 8వ వార్డు పరిధిలో గోస్కెరాజయ్య(జీఆర్) కాలనీ కామారెడ్డి పెద్ద చెరువు వరద కాలువ పక్కనే ఉంది. మంగళవారం అర్థ రాత్రి ఒక్కసారిగా వరద నీరు ప్రవాహం పెరిగిపోవడంతో 15 నిమిషాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. స్థానికులు తేరుకునే లోపే గ్రౌండ్ ఫ్లోర్‌లో పూర్తిగా నీరు చేరడంతో ఉక్కిరిబిక్కరి అయ్యారు. కొందరు బయటకు పరుగులు తీశారు. మరికొందరు మొదటి అంతస్తులోకి పరుగులు తీశారు. సహాయం కోసం కేకలు వేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూటీం, మున్సిపల్, జిల్లా యంత్రాంగం జీఆర్ కాలనీకి చేరుకుని స్థానికులను వరదల్లో నుంచి రాత్రంత్రా శ్రమించి కాపాడారు. కొందరిని పక్కనే ఉన్న సత్య గార్డెన్‌కు తరలించగా, మరికొందరు వారి బంధువుల ఇళ్లకు వెళ్లారు.
చెరువు నుంచి ఉధృతి పెరగడంతో జాతీయ రహదారిపై ఉన్న 15 కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకునిపోయాయి. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. వరద దెబ్బకు ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు, వాహనాలు చెడిపోవడంతో పాటు, ఇళ్లలోని సామగ్రి తడిసిముద్దయ్యాయి. గురువారం ఉదయం ఇండ్ల దుస్థితి చూసుకున్న జీఆర్ కాలనీవాసులు కన్నీరుమున్నీరయ్యారు. పలు ఇండ్లలో పాములు, విష పురుగులు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. మంళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు సిరిసిల్లా బైపాస్ రోడ్డు పైన భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆ రాత్రి డిచ్‌పల్లి నుంచి పాతరాజంపేట వరకు సుమారు 50 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గురువారం ఉదయం నుంచి ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేస్తూ చర్యలు చేపట్టారు. కామారెడ్డి నుంచి కరీనంగర్ వరకు, అలాగే హైదరాబాద్‌కు పూర్తిగా రాకపోకలు నిలిచాయి. మంగళవారం రాత్రి నుంచి గురువారం వరకు ఆర్టీసీ బస్సుల రవాణాను నిలిపివేశారు.
జీఆర్ కాలనీలోని ఓ స్కూల్‌లో వరద తర్వాత పరిస్థితి
వరదలో కొట్టుకొచ్చిన ఆటో
బీభత్సం సృష్టించిన భారీ వర్షం
చెరువు వరద ప్రవాహంలో గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా మునిగిన జీఆర్ కాలనీ
వరదల్లో చిక్కుకుని భయంతో గడిపిన కాలనీవాసులు
సురక్షితంగా కాలనీవాసులను
కాపాడిన పోలీసులు, రెస్క్యూ టీం
వరదల్లో సర్వం కోల్పోయి..
తీవ్రంగా నష్టపోయిన బాధితులు

కామారెడ్డి పురం.. అల్లకల్లోలం

కామారెడ్డి పురం.. అల్లకల్లోలం

కామారెడ్డి పురం.. అల్లకల్లోలం