
‘డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం’
కామారెడ్డి క్రైం: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌లలో సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, వాటి దుష్ప్రభావాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా అవగాహన కల్పించే ఉద్దేశంతో నషా ముక్త్ భారత్ అభియాన్ అమలు చేస్తున్నాయన్నారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమం ఐదో వార్షికోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలను రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మాదక ద్రవ్యాలను ఎవరైనా సరఫరా చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, సీఐలు నరహరి, శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు.