
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మాచారెడ్డి : వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజలకు సూచించారు. పాల్వంచ మండలంలోని భవానీపేట–పోతారం గ్రామాల మధ్య ఉన్న వాగును కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి ఉధృతి అధికంగా ఉన్నందున వంతెన పైనుంచి నీరు ప్రవహించకముందే వాహనాల రాకపోకలను నిలిపివేయాలని ఆర్‌అండ్‌బీ ఈఈ మోహన్‌ను ఆదేశించారు. వర్షాల కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉంటూ లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లా కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు వర్ష సూచనలు తెలుసుకుంటూ, ఆయా గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపుల్లో, అలాగే దండోరా ద్వారా ప్రజలకు సమాచారం అందించాలన్నారు. ఆయనవెంట అదనపు కలెక్టర్ విక్టర్ తదితరులున్నారు.