
ఇసుక, మొరం కొరత లేకుండా చూడాలి
రామారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక, మొరం, ఇటుకల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మండలంలోని రంగంపేటలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తున్నందున పనులనుత్వరగా పూర్తి చేయాలని సూచించారు. పేదలు సంతోషంగా సొంత ఇంటిలో నివసించేందుకు ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇంటి నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల మెటీరియల్స్ లభ్యమయ్యేలా అధికార యంత్రాంగం చూసుకుంటుందని పనులు పూర్తి చేసుకోవాలని అన్నారు. అనంతరం రైతు వేదికలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హౌజింగ్ పీడీ విజయపాల్‌రెడ్డి, తహసీల్ధార్ ఉమాలత, ఎంపీడీవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.