
నగలు, నగదు కోసం కొన్ని..
● వివాహేతర నంబంధాల
నేపథ్యంలో మరికొన్ని..
● సమాజంలో పెరుగుతున్న నేర ప్రవృత్తి
● ఆందోళన కలిగిస్తున్న ఘటనలు
జిల్లాలో ఇటీవలి కాలంలో హత్యల పరంపర కొనసాగుతోంది. సగటున వారానికో హత్య జరుగుతోంది. చాలా కేసుల్లో అయిన వారే హంతకులుగా తేలుతున్నారు. కొన్ని సంఘటనల్లో నగలు, నగదుకోసం, మరికొన్ని సంఘటనలు వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరుగుతున్నట్టు తెలుస్తోంది.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : నేరస్తులకు శిక్షలు పడుతున్నా సమాజంలో నేర ప్రవృత్తి తగ్గడంలేదు. పైపెచ్చు మరింతగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మే 1 వరకు జిల్లాలో 16 హత్యలు జరిగాయి. అంటే వారానికొక హత్య జరిగినట్లు స్పష్టమవుతోంది. గతేడాది కూడా వారానికొకరు అన్నట్టుగానే 47 మంది హత్యకు గురయ్యారు. కొన్ని సంఘటనల్లో నిందితులు ఎలాంటి క్లూ దొరక్కుండా జాగ్రత్త పడ్డా.. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ హత్య కేసులను తేలుస్తున్నారు. కొన్ని కేసుల్లో ఒకటి రెండు రోజుల్లోనే నేరస్తులు చిక్కుతున్నారు. కొన్ని హత్యలు వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగినట్టు స్పష్టమవుతుండగా, మరికొన్ని నగలు, నగదు, ఆస్తి వంటి విషయాల్లో జరుగుతున్నాయి. కాగా కొన్ని కేసుల్లో కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులే హంతకులుగా తేలుతున్నారు. ఇటీవల మాచారెడ్డి మండలం ఘన్‌పూర్(ఎం) గ్రామానికి చెందిన కుమార్ అనే యువకుడిని ఫరీదుపేట శివారులో వెంబడించి ఇనుపరాడ్లు, గొడ్డలితో దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో రోడ్డు మీదుగా వెళ్లేవారు గమనించడంతో దాడి చేసిన వ్యక్తులు పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన కుమార్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ కేసును విచారించిన పోలీసులు బాధితుడి భార్యనే కుట్రదారుగా తేల్చారు. సుఫారీ ఇచ్చి భర్త హత్యకు కుట్ర పన్నినట్టు తేల్చి భార్యతో పాటు పలువురు నిందితులను హత్యాయత్నం కేసులో అరెస్టు చేశారు. ఇలాంటి సంఘటనలు సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాల్లోనే ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. అలాగే నగలు, నగదు కోసం కూడా హత్యలకు పాల్పడుతున్నారు.