మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
● టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
● పేద ముస్లింలకు దుప్పట్లు,
స్వెట్టర్ల పంపిణీ
నిజామాబాద్ రూరల్: మైనార్టీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. నగరంలోని బోధన్ రోడ్డులోగల ఓ ఫంక్షన్‌హాల్‌లో బుధవారం రాత్రి పేద ముస్లింలకు, ఇమామ్, మౌజాలకు దుప్పట్లు, స్వెటర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ముస్లింలకు దుప్పట్లు, స్వెటర్లు పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేశారు. అనంతరం మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ..మౌలానా అబుల్ కలాం ఆజాద్ తొలి విద్యా మంత్రిగా విద్యారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాల ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవించేలా సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. మహమ్మద్ అజ్మతుల్లా, మానాల మోహన్‌రెడ్డి, కర్నె సురేందర్, నర్సయ్య, అనంతరావు బోడిరే స్వామి, తదితరులు పాల్గొన్నారు.


