సన్న రకాలకు అందని బోనస్
బాన్సువాడ : జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ ఊపందుకుంది. మరో వారం, పది రోజుల్లో కొనుగోళ్లు చివరి దశకు చేరనున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో ధాన్యంకు సంబంధించి డబ్బులు జమ అవుతున్నా..బోనస్ మాత్రం జమ కావడం లేదు. జిల్లాలో ఈ యాసంగిలో 2.61.110 ఎకరాల్లో వరి సాగుచేశారు. ఇందులో సన్నరకాలు 57.445 ఎకరాల్లో సాగయ్యాయి. జిల్లాలో 1.32 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడులు వచ్చాయి. గత నెల ఏప్రిల్ మొదటి వారం నుంచే జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. బాన్సువాడ డివిజన్‌లోనే మొదటగా వరి నాట్లు వేస్తారు. కొనుగోళ్లు కూడా ముందే ప్రారంభించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సన్న, దొడ్డు రకాలకు సంబంధించి 2.06.750 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. సేకరించిన ధాన్యానికి సంబంధించి రైతుల ఖతాల్లో రూ. 310 కోట్లు జమ చేశారు. సన్నరకం ధాన్యానికి ఇప్పటికి బోనస్ చెల్లించకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పాలకులు, అధికారులు స్పందించి సన్నరకం విక్రయించిన రైతులకు బోనస్ చెల్లించాలని కోరుతున్నారు.
57.445 ఎకరాల్లో సన్నరకం
సాగు చేసిన రైతులు
రైతులకు తప్పని ఎదురుచూపులు
రాని బోనస్ డబ్బులు
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాం. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో చాల మంది రైతులు సన్నరకం ధాన్యం పండించారు. ధాన్యంకు సంబంధించిన డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయి. బోనస్ డబ్బులు మాత్రం పడలేదు.
–వెంకటి రైతు,బాన్సువాడ
బోనస్ ఇస్తామంటేనే సన్నరకం సాగు చేశాం
ధాన్యంకు సంబంధించిన డబ్బులతో పాటే బోనస్ ఖాతాల్లో జమ చేయాలి. ధాన్యం కొనుగోళ్లు పూర్తియ్యాయి. కానీ బోనస్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. బోనస్ ఇస్తామంటేనే సన్నరకం వడ్లు సాగు చేశాం. –సాయిలు రైతు,బాన్సువాడ


