భూభారతితో భూ సమస్యలు పరిష్కారం
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
నాగిరెడ్డిపేట/ఎల్లారెడ్డి: దశాబ్దాలుగా నెలకొన్న భూ సమస్యలు భూ భారతి చట్టం వల్ల పరిష్కారం కానున్నాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్‌పేట, ఎల్లారెడ్డి మండలంలోని మీసాన్‌పల్లి రైతువేదికలలో శనివారం భూభారతి అవగాహన సదస్సులకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ధరణి స్థానంలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతిపై రైతులకు అవగాహన కల్పించడానికే సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. భూ భారతి చట్టంలో భూరిజిస్ట్రేషన్, భూ రికార్డుల్లో తప్పుల సవరణ, సాదాభైనామా దరఖాస్తులకు, వారసత్వంగా వచ్చిన భూముల దరఖాస్తులకు పరిష్కారం లభించనుందన్నారు. గతంలో ధరణిలో అప్పీల్‌కు ఆస్కారం లేనందున సివిల్ కోర్టుకు వెళ్లవలసి ఉండేదని, కాని ప్రస్తుత భూ భారతి చట్టం ద్వారా భూ రిజిస్ట్రేషన్లపై అభ్యంతరాలుంటే భూ యజమానులు ఆర్డీవో, కలెక్టర్, ట్రిబ్యునల్‌కు అప్పీల్ చేసుకోవచ్చని వివరించారు. 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని సాదాభైనామాల ద్వారా కొనుగోలు చేసి, గడిచిన 12 ఏళ్లుగా అనుభవంలో ఉంటూ 12.10.2020 నుంచి 10.11.2020 మధ్య కాలంలో క్రమబద్ధీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీవో విచారణ చేసి అర్హత కల్గిన రైతుల నుంచి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంప్‌డ్యూటీ వసూలుచేసి సర్టిఫికేట్ జారీ చేస్తారన్నారు. అదనపు కలెక్టర్ విక్టర్, ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్, నాగిరెడ్డిపేట తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, ఆర్‌ఐ మహ్మద్, ఎల్లారెడ్డి తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, ఏఎంసీ చైర్‌పర్సన్ రజిత, తదితరులు పాల్గొన్నారు.


