అకాల వర్షంతో ఆగమాగం
మాచారెడ్డి/కామారెడ్డి రూరల్/రాజంపేట/బీబీపేట: జిల్లాలోని పలు ప్రాంతాలలో శుక్రవారం బలమైన గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఇళ్లు, షెడ్లకు సంబంధించిన రేకులు కొట్టుకుపోయాయి. మాచారెడ్డి మండలంలోని చుక్కాపూ ర్, అక్కాపూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. మామిడి కాయలు రాలిపోయాయి. పాల్వంచలో కామారెడ్డి –సిరిసిల్ల రహదారిపై చెట్లు విరిగి రోడ్డుకు అడ్డం పడిపోయాయి. కామారెడ్డి మండలంలోని గూడెం గ్రామంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. గ్రామానికి చెందిన తెడ్డు బాలరాజు, చిట్టపురం బాలరాజు, కిష్టయ్య, స్వామి, గుడుగుల బాలరాజులకు చెందిన రేకుల ఇండ్లు, చిందాల రాజిరెడ్డి కోళ్ల ఫారం రేకులు కొట్టుకుపోయాయి. రాజంపేట మండలంలోని ఎల్లారెడ్డిపల్లి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని జీత్యానాయక్ ఇంటి పైకప్పు రేకులు కొట్టుకుపోయాయి. ఇంట్లో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బీబీపేట మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో బలమైన గాలులు వీచాయి. మల్కాపూర్ రోడ్‌లోని రైస్ మిల్ రేకులు కూలిపోయాయి. శివారు రాంరెడ్డిపల్లిలో గ్రామ పంచాయతీ కార్మికుడి ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. బీబీపేటలో ఏడు విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బీబీపేటలో రెండు ఇళ్ల పై రేకులు లేచిపోయాయి. ఎంపీడీవో కార్యాలయం ముందున్న నర్సరీకి ఏర్పాటుచేసిన నెట్ మొక్కలపై పడిపోయింది.
అకాల వర్షంతో ఆగమాగం
అకాల వర్షంతో ఆగమాగం


